రూ. 1000 తగ్గించారు
ఇసుక ర్యాంపుల్లో అక్రమ వసూళ్లలో కొత్త లెక్కలు
కాకతీయ వరుస కథనాలతో ఇసుకాసురుల్లో అలజడి
రూ. 5600 నుంచి రూ. 4500కు మార్పు
చర్యలకు, తనిఖీలకు మంగళం పాడిన టీజీఏండీసీ
వంత పాడటంలో ఆంతర్యం ఏమిటి
కాకతీయ, కరీంనగర్ బ్యూరో : కరీంనగర్ జిల్లా పరిధిలోని ఇసుక ర్యాంపుల్లో అక్రమ వసూళ్లు రూపం మార్చుకున్నాయే తప్ప ఆగలేదు. ‘మీ కోసమే వెయ్యి రూపాయలు తగ్గించాం’ అంటూ కాంట్రాక్టర్లు లారీ డ్రైవర్లను మభ్యపెడుతూ కొత్త వసూళ్ల పద్ధతిని అమలు చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కాకతీయ వరుస కథనాలతో ఏర్పడిన ఒత్తిడికి తాత్కాలికంగా వసూళ్ల మొత్తాన్ని తగ్గించినా, అసలు అక్రమ వ్యవస్థ మాత్రం యథాతథంగా కొనసాగుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇంతకుముందు ఒక్కో లారీపై రూ.5600 వరకు వసూలు చేసిన నిర్వాహకులు ఇప్పుడు మొత్తం రూ.4500కు పరిమితం చేశారు. లోడింగ్ పేరుతో రూ.2500, పట్టా (పర్దా) పేరుతో రూ.1500, జేసీబీకి రూ.200, ఇసుక లెవలింగ్కు రూ.300 వసూలు చేస్తున్నట్లు లారీ డ్రైవర్లు చెబుతున్నారు. ర్యాంపులో అడుగుపెట్టినప్పటి నుంచి బయటకు వచ్చే వరకు ఏదో ఒక పేరుతో డబ్బులు చెల్లించకపోతే లోడింగ్ జరగదన్న పరిస్థితి కొనసాగుతోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పట్టా పేరుతో వసూలు… కప్పడం మాత్రం లేదు!
అక్రమ వసూళ్లలో మరో కొత్త మాయ బయటపడింది. పట్టా పేరుతో రూ.1500 వసూలు చేస్తున్నప్పటికీ లారీలపై ఇసుక కప్పకుండా ర్యాంపుల నుంచి పంపిస్తున్నారని డ్రైవర్లు ఆరోపిస్తున్నారు. దీని వల్ల రహదారులపై ఇసుక చల్లరేగి ప్రమాదాలకు దారి తీస్తోందని, వెనుక వస్తున్న వాహనదారులతో వాగ్వాదాలు జరుగుతున్నాయని చెబుతున్నారు. డబ్బులు తీసుకుంటే సేవ ఎందుకు ఇవ్వడం లేదన్న ప్రశ్నలకు నిర్వాహకుల వద్ద సమాధానం లేదని డ్రైవర్లు వాపోతున్నారు. ఇసుక ర్యాంపుల్లో జరుగుతున్న అక్రమాలపై కాకతీయ వరుస కథనాలు ప్రచురించడంతో నిర్వాహకుల్లో కలకలం మొదలైంది. ఈ కథనాల ప్రభావంతోనే వసూళ్ల మొత్తాన్ని తాత్కాలికంగా తగ్గించినట్లు డ్రైవర్లే చెబుతున్నారు. “వార్తలు వచ్చాయి కాబట్టే ఇప్పుడు తగ్గించారు… మళ్లీ కొద్ది రోజుల్లో పెంచుతారు” అంటూ ఒక లారీ డ్రైవర్ చేసిన వ్యాఖ్యలు పరిస్థితి తీవ్రతను తెలియజేస్తున్నాయి. ఈ అక్రమ వసూళ్లు టీజీఏండీసీ సిబ్బంది ముందే జరుగుతున్నాయా? అన్న ప్రశ్నకు “అందరికీ తెలిసే జరుగుతోంది” అని డ్రైవర్లు చెప్పడం మరింత సంచలనంగా మారింది.
చర్యలకు దూరంగా టీజీఏండీసీ?
ఇసుక ర్యాంపుల్లో బహిరంగంగా డబ్బులు వసూలవుతున్నా టీజీఏండీసీ అధికారుల నుంచి ఎలాంటి చర్యలు లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. తనిఖీలు, కఠిన చర్యలు తీసుకోవాల్సిన శాఖ పూర్తిగా మౌనం వహిస్తోందన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. అక్రమ వసూళ్ల మొత్తాన్ని మార్చడమే చర్యలుగా భావిస్తున్నారా? లేక కాంట్రాక్టర్లకు మౌన మద్దతు ఇస్తున్నారా? అన్న ప్రశ్నలు లారీ డ్రైవర్లలో ఉత్పన్నమవుతున్నాయి. ఇసుక ర్యాంపుల్లో జరుగుతున్న అక్రమ వసూళ్లపై వివరణ కోరేందుకు కాకతీయ టీజీఏండీసీ పీఓను పలుమార్లు సంప్రదించేందుకు ప్రయత్నించినా ఆయన అందుబాటులోకి రాలేదు.


