దివ్యాంగుల సంక్షేమానికి రూ.100 కోట్లు
చదువుకునే దివ్యాంగులకు ఐప్యాడ్లు, ట్యాబ్స్
రెండేళ్లలోనే దివ్యాంగుల కోసం భారీ వ్యయం
ప్రజా ప్రభుత్వ అండతో దివ్యాంగుల జీవితాల్లో కొత్త ఆశలు
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
మధిరలో ట్రై సైకిళ్ల పంపిణీ
కాకతీయ, ఖమ్మం : దివ్యాంగుల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని రాష్ట్ర డిప్యూటీ సీఎం, ఆర్థిక–ప్రణాళిక–ఇంధన శాఖల మంత్రి భట్టి విక్రమార్క మల్లు స్పష్టం చేశారు. గత ప్రభుత్వం పదేళ్లలో చేయలేని పనులను ప్రస్తుత ప్రభుత్వం రెండేళ్లలోనే సాధించిందని, అందులో భాగంగానే దివ్యాంగుల కోసం రూ.100 కోట్లను ఖర్చు చేసినట్లు వెల్లడించారు. బుధవారం మధిర నియోజకవర్గ కేంద్రంలో జిల్లా కలెక్టర్ *అనుదీప్ దురిశెట్టి*తో కలిసి దివ్యాంగులకు ట్రై సైకిళ్లను డిప్యూటీ సీఎం పంపిణీ చేశారు. దివ్యాంగులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని, వారి అవసరాలను గుర్తించి ప్రభుత్వమే ముందుకొస్తోందని తెలిపారు.

చదువు–సాంకేతికతలో తోడ్పాటు
ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ, చదువుకుంటున్న దివ్యాంగులకు ఐప్యాడ్లు, కంప్యూటర్లు, ట్యాబ్స్ వంటి ఆధునిక పరికరాలను ప్రజా ప్రభుత్వం అందిస్తోందని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. తమది ప్రజల గురించి ఆలోచించే ‘ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వం’ అని, దివ్యాంగులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా అన్ని సంక్షేమ పథకాలు అందిస్తామని హామీ ఇచ్చారు. దురదృష్టవశాత్తు అంగవైకల్యంతో పుట్టిన వారిని కూడా సమాజంలో మనతో పాటు ముందుకు నడిపించాల్సిన బాధ్యత అందరిపై ఉందని డిప్యూటీ సీఎం అన్నారు. దివ్యాంగుల గురించి సమాజంలోని ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని, వారు కూడా అన్ని రంగాల్లో రాణించాల్సిందేనని స్పష్టం చేశారు.
మరింత అవకాశాలు ఇవ్వాలి
సమాజంలో ఇతరుల కంటే ఎక్కువ అవకాశాలు, ఆసరా దివ్యాంగులకు కల్పించాలని భట్టి విక్రమార్క సూచించారు. అంగవైకల్యం ఉందన్న బాధ వారికి కలగకుండా ప్రోత్సహించి ముందుకు తీసుకువెళ్లాలని చెప్పారు. ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వం ఇదే ఆలోచనతో పాలన సాగిస్తోందని వివరించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ, ఇరిగేషన్ ఎస్ఈ వాసంతి, విద్యుత్ ఎస్ఈ శ్రీనివాస చారి, ఆర్ అండ్ బీ ఎస్ఈ యాకుబ్, జిల్లా సంక్షేమ అధికారిణి వేల్పుల విజేత, జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి ముజాహిద్, జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి శ్రీనివాస్, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ నర్సింహారావు, వ్యవసాయ శాఖ ఏడీ విజయచందర్, మధిర తహసీల్దార్ రాంబాబు తదితర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.


