శాతవాహన అభివృద్ధికి రూ.100 కోట్లు
డీపీఆర్‌లు వెంటనే పంపండి
వీసీ ఉమేష్‌కుమార్‌కు మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాలు
కాకతీయ, కరీంనగర్ : శాతవాహన విశ్వవిద్యాలయం అభివృద్ధికి ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు ప్రారంభించినట్లు రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. శుక్రవారం రోజున విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య ఉమేష్‌కుమార్ తో మాట్లాడిన మంత్రి పొన్నం ప్రభాకర్ మౌలిక సదుపాయాల బలోపేతానికి రూ.100 కోట్ల వరకు ప్రతిపాదనలు వెంటనే సిద్ధం చేయాలని ఆదేశించారు.
ఉన్నత విద్యను రాష్ట్రవ్యాప్తంగా మరింత అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలని ప్రభుత్వం సంకల్పించినట్లు మంత్రి తెలిపారు. ఈ లక్ష్యంతో శాతవాహనకు అవసరమైన ప్రాధాన్యతా పనులు, భవన నిర్మాణాలు, పరిశోధనా ప్రయోగశాలలు, ఆట స్థలాల సదుపాయాలు, ఓపెన్ ఎయిర్ ఆడిటోరియం వంటి అంశాలకు సంబంధించిన డిపిఆర్‌లు తక్షణమే సమర్పించాలి అని సూచించారు. ఉపకులపతి ఆచార్య ఉమేష్‌కుమార్ మాట్లాడుతూ విశ్వవిద్యాలయానికి అత్యవసర అవసరాలన్నీ సమగ్రంగా సిద్ధం చేసి పది రోజులలోపు వివరణాత్మక ప్రాజెక్టు నివేదికను ప్రభుత్వానికి పంపిస్తామని తెలిపారు.


