- ప్రభుత్వం తరపున వెల్ఫేర్ ఫండ్ ఏర్పాటు
- పిల్లల కోసం కార్పొరేట్ స్థాయి పాఠశాలలు
- హాలీవుడ్‌ను హైదరాబాద్‌కు తీసుకువస్తా..
- లాభాల్లో 20 శాతం కార్మికులకు ఇస్తేనే టికెట్ల ధరల పెంపు
- త్వరలోనే సినీ కార్మికులకు ఇళ్ల స్థలాలు
- జూబ్లీహిల్స్‌లో నవీన్‌యాదవ్‌ను గెలిపించండి
- సమస్యలు పరిష్కరించే బాధ్యత తీసుకుంటా..
- ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
- యూసుఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్‌లో సీఎంకు సన్మాన సభ
- భారీగా తరలివచ్చిన సినీ ప్రముఖులు.. కాంగ్రెస్ శ్రేణులు

కాకతీయ, తెలంగాణ బ్యూరో : ఫ్యూచర్ సిటీలో సినీ పరిశ్రమకు ప్రాధాన్యం ఉండేలా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. సినీ కార్మికుల పిల్లల కోసం కార్పొరేట్ స్థాయి పాఠశాలలు నిర్మిస్తానని ఉద్ఘాటించారు. సినీ కార్మికుల పిల్లలకి ఉచితంగా చదువు చెప్పిస్తామని హామీ ఇచ్చారు. మంగళవారం యూసుఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్‌లో సినీ కార్మికుల సమాఖ్య ఆధ్వర్యంలో సీఎం రేవంత్‌రెడ్డి సన్మాన సభ జరిగింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డిని సినీ ప్రముఖులు సన్మానించారు. సన్మాన సభకు సినీ ప్రముఖులు భారీగా తరలివచ్చారు. అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగించారు.
చౌకగా భూములు కేటాయించారు..
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో నవీన్ యాదవ్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని సీఎం రేవంత్‌రెడ్డి కోరారు. ఒకప్పుడు తెలుగు పరిశ్రమని మదరాసి అని పిలిచేవారని చెప్పుకొచ్చారు. తెలుగు పరిశ్రమను హైదరాబాద్‌కు తరలించాలని.. ఆనాటి సీఎం మర్రి చెన్నారెడ్డి తీవ్రంగా కృషి చేశారని తెలిపారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ వంటి వారిని మర్రి చెన్నారెడ్డి సంప్రదించి తెలుగు పరిశ్రమ హైదరాబాద్‌కు వచ్చేందుకు కృషి చేశారని ఉద్ఘాటించారు. చిత్రపురి కాలనీకి ప్రపంచస్థాయి గుర్తింపునకు ఆనాటి నాయకులు కృషి చేశారని తెలిపారు. చిత్రపరిశ్రమను ప్రోత్సహించాలని తక్కువ ధరకే స్టూడియోలకు భూములు ఇచ్చామని నొక్కిచెప్పారు. రామానాయుడు, పద్మాలయా, అన్నపూర్ణ స్టూడియోలకు అప్పటి సీఎంలు చౌకగా భూములు కేటాయించారని పేర్కొన్నారు సీఎం రేవంత్‌రెడ్డి.
సినీ కార్మికుల శ్రమ, కష్టం నాకు తెలుసు..
‘కళాకారులను గౌరవించాలని 1964లో నంది అవార్డు కార్యక్రమాన్ని ప్రారంభించారు. కళాకారులకు కావాల్సింది డబ్బు కాదు.. జనం కొట్టే చపట్లు.. కప్పే దుప్పట్లు. సినీ కార్మికుల శ్రమ, కష్టం నాకు తెలుసు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పదేళ్లు అవార్డులు ఇవ్వలేదు. మేము అధికారంలోకి వచ్చాక గద్దర్ పేరు మీద సినీ అవార్డులు ఇచ్చాం. హైదరాబాద్ నగరం ప్రపంచ సినీ పరిశ్రమకు వేదిక కావాలనేది నా సంకల్పం. హైదరాబాద్ నగరం ఐటీ, ఫార్మా పరిశ్రమలకి వేదిక ఎలాగో.. ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా అంతే. మీరు అండగా ఉంటే హాలీవుడ్‌ను హైదరాబాద్‌కు తీసుకువస్తా’ అని సీఎం రేవంత్‌రెడ్డి ఉద్ఘాటించారు.
వెల్ఫేర్ ఫండ్ ఏర్పాటు..
‘హాలీవుడ్ సినిమాలు రామోజీ ఫిల్మ్‌సిటీలో, హైదరాబాద్‌లో.. షూటింగ్‌లు జరిగేలా బాధ్యత తీసుకుంటాం. సినీ కార్మికుల కోసం మా ప్రభుత్వం తరఫున చేయగలిగిన పనులు చేస్తాం. సినీ కార్మికుల కోసం వెల్ఫేర్ ఫండ్ ఏర్పాటు చేస్తున్నాం. సినీ కార్మికుల వెల్ఫేర్ ఫండ్‌లో మా ప్రభుత్వం తరపున రూ.10 కోట్లు డిపాజిట్ చేస్తాం. సినిమా టికెట్లు పెంపు ద్వారా వచ్చిన ఆదాయంలో 20 శాతం కార్మికులకు ఇవ్వాలి. కార్మికులకు లాభాల్లో 20 శాతం ఇస్తేనే టికెట్ల ధరలు పెంచుకునేందుకు జీవో ఇస్తాం. సినీ కార్మికుల భవన్ నిర్మాణానికి స్థలం ఇస్తాం. త్వరలోనే సినీ కార్మికులకు ఇళ్ల స్థలాలు ఇస్తాం. సినీ కార్మికుల అసోసియేషన్‌తో మాట్లాడి స్థలాలు ఇస్తాం. ఫైటర్స్, సినీ కార్మికుల ప్రాక్టీస్‌కు ప్యూచర్ సిటీలో ఏర్పాట్లు చేస్తాం. సినీ కార్మికుల సమస్యలు పరిష్కరించే బాధ్యత నాది. నవంబర్ చివరి వారంలో సినీ కార్మికులతో మాట్లాడతాం’ అని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.


