కాకతీయ, నేషనల్ డెస్క్: రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్ రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (RRC) నార్త్ వెస్ట్రన్ రైల్వే (NWR) పరిధిలో భారీ అప్రెంటిస్ నియామక ప్రకటనను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 2,094 యాక్ట్ అప్రెంటిస్ ఖాళీలు భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులు అజ్‌మేర్, బికనీర్, జైపూర్, జోధ్‌పూర్ వంటి డివిజన్లలోని వర్క్‌షాప్‌లు, యూనిట్లలో భర్తీ చేయనున్నారు. ముఖ్యంగా డివిజనల్ రైల్వే మేనేజర్ కార్యాలయాలు, బీటీసీ క్యారేజ్ (అజ్‌మేర్), బీటీసీ లోకో (అజ్‌మేర్), క్యారేజ్ వర్క్స్‌షాప్ (బికనీర్), క్యారేజ్ వర్క్స్‌షాప్ (జోధ్‌పూర్) లలో ఖాళీలు ఉన్నాయి.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు కనీసం పదో తరగతి (మేట్రిక్యులేషన్)లో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అదనంగా సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ సర్టిఫికెట్ కలిగి ఉండటం తప్పనిసరి. ఈ నియామకంలో ఎలక్ట్రికల్, ఫిట్టర్, కార్పెంటర్, వెల్డర్, పైప్ ఫిట్టర్, పెయింటర్, మేసన్, డీజిల్ మెకానిక్, మెషినిస్ట్, ఎలక్ట్రీషియన్ వంటి విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.
అభ్యర్థుల వయస్సు నవంబర్ 2, 2025 నాటికి కనీసం 15 సంవత్సరాలు, గరిష్టంగా 24 సంవత్సరాలు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ఐదేళ్లు, ఓబీసీ వర్గాలకు మూడేళ్ల వయోపరిమితి సడలింపు వర్తిస్తుంది. దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు నవంబర్ 2, 2025 లోపు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి. జనరల్ అభ్యర్థుల నుంచి రూ. 100 దరఖాస్తు రుసుము చెల్లించాలి. అయితే ఎస్సీ, ఎస్టీ, మహిళా, దివ్యాంగ అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెల్లించనవసరం లేదు.
ఎంపిక ప్రక్రియ పూర్తిగా మేట్రిక్యులేషన్, ఐటీఐలో సాధించిన మార్కుల ఆధారంగా జరుగుతుంది. మెరిట్ ఆధారంగా ఎంపికైన అభ్యర్థులు తరువాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ పరీక్షలను ఎదుర్కొనవలసి ఉంటుంది. ఆసక్తి గల అభ్యర్థులు పూర్తి వివరాలు, దరఖాస్తు లింక్‌ను జైపూర్ రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా పొందవచ్చు.


