రౌడీ షీటర్ నితిన్ వర్ధన్ అరెస్టు
కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ రూరల్ పోలీసులు పరారీలో ఉన్న రౌడీ షీటర్‌ను అరెస్టు చేసి కేసుల మిస్టరీని ఛేదించారు. పలు నేరాల్లో నిందితుడిగా ఉన్న నితిన్ వర్ధన్ అనే వ్యక్తి పోలీసులకు వరుసగా తప్పించుకుంటూ పలుచోట్ల తలదాచుకుంటూ తిరిగాడు. అయితే పక్కా సమాచారం ఆధారంగా రూరల్ పోలీసులు రెహదారి పహారా పెంచి అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని రూరల్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఏ. నిరంజన్ రెడ్డి వెల్లడించారు.నిందితుడు నితిన్ వర్ధన్‌పై గతంలో వన్ టౌన్, టూ టౌన్, త్రీ టౌన్, రూరల్ స్టేషన్లలో పలు కేసులు నమోదైన సంగతి తెలిసిందే. అతని నేర చరిత్రను పరిగణనలోకి తీసుకుని పోలీసులు అతని పై రౌడీ షీట్ తెరవడం జరిగింది. అయినప్పటికీ అతడు మరోసారి మోసపూరిత చర్యల్లో పాల్పడుతూ తిరిగినట్లు పోలీసులు తెలిపారు.తీగులగుట్టపల్లి కార్తికేయనగర్‌కు చెందిన పంబాల శ్రీనివాస్ భూమిని కబ్జా చేసేందుకు నిందితుడు నితిన్ తప్పుడు వారసత్వ ధృవపత్రం తయారు చేసి బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ వ్యవహారంలో అతడితో పాటు మరో ముగ్గురిపై కేసు నమోదు అయింది. మరో ఘటనలో, భూమి రిజిస్ట్రేషన్ చేస్తానని నమ్మబలికి ఒకవ్యక్తి నుంచి డబ్బులు తీసుకొని, రిజిస్ట్రేషన్ చేయకుండా మోసం చేసినట్లు పోలీసులు తెలిపారు.ఈ రెండు కేసుల్లో నిందితుడు దొరకకుండా వరుసగా ప్రాంతాలు మార్చుకుంటూ పోలీసులను తప్పించుకునే ప్రయత్నం చేశాడు. అయితే, రూరల్ పోలీసులు చాకచక్యంగా ఏర్పాట్లు చేసి అతడిని అరెస్టు చేశారు. అనంతరం నిందితుడిని కోర్టులో హాజరుపర్చినట్లు తెలిపారు.


