ఓరుగల్లులో రాకెట్ గర్జన
వరంగల్ చరిత్రలో తొలిసారిగా రాకెట్ ప్రయోగం
జాతీయ సైన్స్ దినోత్సవం రోజే లాంచింగ్
కాకతీయ, హనుమకొండ : వరంగల్ గడ్డపై చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. ఓరుగల్లు చరిత్రలో తొలిసారిగా రాకెట్ లాంచింగ్ కార్యక్రమాన్ని ఈ నెల 28న నిర్వహించనున్నారు. జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని హనుమకొండ హయగ్రీవాచారి గ్రౌండ్లో “రుద్రమ” పేరుతో రూపొందించిన మోడల్ రాకెట్‌ను ఆకాశంలోకి ప్రయోగించనున్నారు. ఈ వినూత్న కార్యక్రమాన్ని ఇస్రో స్పేస్ ట్యూటర్, ఏటీడీఆర్ఎల్ సంస్థ వ్యవస్థాపకుడు శశాంక్ భూపతి నేతృత్వంలో నిర్వహిస్తున్నారు. దీనికి వరంగల్ నిట్, కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (కుడా) ప్రత్యేక సహకారం అందిస్తున్నాయి. యువతలో శాస్త్ర సాంకేతికతపై ఆసక్తి పెంచడమే ప్రధాన లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు. భద్రతా ప్రమాణాలు పాటిస్తూ రూపొందించిన రుద్రమ రాకెట్ ప్రయోగాన్ని విద్యార్థులు ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం కల్పిస్తున్నారు. అదే రోజు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అంతరిక్ష విజ్ఞాన సదస్సు జరగనుంది. రాకెట్ టెక్నాలజీ, ఇస్రో విజయాలు, భవిష్యత్ అంతరిక్ష ప్రణాళికలపై నిపుణులు ప్రసంగించనున్నారు. వరంగల్‌లో జరుగుతున్న ఈ తొలి రాకెట్ ప్రయోగం జిల్లాకు జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు తెచ్చే కార్యక్రమంగా నిలుస్తుందని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.


