ఇసుక ర్యాంపుల్లో దోపిడీ దందా..!
లోడింగ్ పేరుతో ఒక్కో లారీపై రూ.7,000 వరకు అక్రమ వసూళ్లు
డీడీ చెల్లించినప్పటికీ అదనపు చార్జీలతో లారీ యజమానులపై భారం
కాంట్రాక్టర్ల దౌర్జన్యంపై మండిపడుతున్న లారీ అసోసియేషన్లు
టీజీఎండీసీ అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర ఆరోపణలు
గనులు, భూగర్భ శాఖ ప్రధాన కార్యదర్శికి ఫిర్యాదు
అక్రమ రవాణా లారీలను బ్లాక్లిస్ట్ చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి
పెద్ద అంబర్పేట ఇసుక లారీ అసోసియేషన్ ప్రెసిడెంట్ భాస్కర్ గౌడ్
కాకతీయ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా ఇసుక ర్యాంపుల్లో కాంట్రాక్టర్లు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారంటూ పెద్ద అంబర్పేట ఇసుక లారీ యజమానుల సంఘం అధ్యక్షుడు భాస్కర్ గౌడ్ ఆధ్వర్యంలో లారీ యజమానులు రాష్ట్ర గనులు, భూగర్భ శాఖ ప్రధాన కార్యదర్శికి ఫిర్యాదు చేశారు.
టీజీఎండీసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇసుక లోడింగ్ ప్రక్రియలో నిబంధనలు తుంగలో తొక్కి లారీ యజమానుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారని సంఘం నాయకులు ఆరోపించారు. ఈసందర్భంగా భాస్కర్ గౌడ్ మాట్లాడుతూ..! లారీ యజమానులు టీజీఎండీసీకి డీడీ రూపంలో ఇప్పటికే రూ.15,250 వరకు చెల్లిస్తున్నప్పటికీ, కాంట్రాక్టర్లు అదనంగా లోడింగ్ పేరుతో ఒక్కో లారీ నుంచి రూ.2,500 నుంచి రూ.3,000 వరకు అక్రమంగా డిమాండ్ చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం లోడింగ్ ఖర్చుల కోసం సుమారు రూ.3,500 చెల్లిస్తున్నప్పటికీ, కాంట్రాక్టర్లు రెండు వైపులా వసూళ్లు చేస్తూ ఒక్కో లారీపై మొత్తం రూ.6,000 నుంచి రూ.7,000 వరకు దోచుకుంటున్నారని ఆరోపించారు.
జిల్లాల వారీగా అక్రమ వసూళ్ల జాబితా
పలుజిల్లాల్లో కాంట్రాక్టర్లు వివిధ పేర్లతో అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు సంఘం వివరించింది. ములుగు జిల్లాలో లోడింగ్, పట్టా, జేసీబీ, ఇతర చార్జీల పేరుతో రూ.3,700 వరకు వసూలు చేస్తున్నారని పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లాలో ఈ మొత్తం రూ.3,900 వరకు చేరుతుండగా, నల్గొండ జిల్లా వంగమర్తి ర్యాంపులో రూ.2,400 వరకు డబ్బులు వసూలు చేస్తున్నారని తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు, చర్ల ప్రాంతాల్లో రూ.2,000 వరకు, భూపాలపల్లి జిల్లాలో రూ.3,600 వరకు అక్రమ వసూళ్లు జరుగుతున్నాయని వెల్లడించారు. ఈ విధంగా ప్రతి ర్యాంపులో రోజుకు లక్షల రూపాయల అక్రమ వసూళ్లు జరుగుతున్నాయని ఆరోపించారు.
లారీ యజమానులపై వేధింపులు, దాడులు
లోడింగ్ చార్జీలపై ప్రశ్నించిన లారీలను కావాలనే పక్కకు పెట్టి లోడింగ్ చేయకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని లారీ యజమానులు ఆవేదన వ్యక్తం చేశారు. డ్రైవర్లపై దాడులు జరిగిన ఘటనలు కూడా ఉన్నాయని తెలిపారు. పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. టీజీఎండీసీ అధికారులు ఈ వ్యవహారాన్ని పట్టించుకోకపోవడం అనుమానాలకు తావిస్తున్నదని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న లారీలను గుర్తించి వెంటనే బ్లాక్లిస్ట్ చేయాలని సంఘం డిమాండ్ చేసింది. ఇసుక ర్యాంపుల్లో జరుగుతున్న అక్రమ వసూళ్లపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరింది.
ఇసుక సరఫరా ప్రక్రియలో పారదర్శకతను తీసుకువచ్చి, లారీ యజమానులపై జరుగుతున్న దోపిడీని అరికట్టాలని పెద్ద అంబర్పేట ఇసుక లారీ యజమానుల సంఘం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.
ఫిర్యాదు చేసిన వారిలో లారీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రవీందర్, ఉపాధ్యక్షులు బలరాం గౌడ్, నర్సింహా, సభ్యులు శ్రీను, యాదగిరి, నర్సింహా, కుమార్, శేఖర్, అశోక్, శ్రీశైలం, సతీశ్, స్వామి, మునుకుంట్ల నర్సింహా, వెంకన్న తదితరులు ఉన్నారు.


