కాకతీయ, కరీంనగర్ : ఇల్లందకుంట మండలం రాచపల్లి గ్రామంలో సోమవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు పాఠశాల తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. స్కూల్ యాజమాన్యం తెలిపిన వివరాల ప్రకారం.. అక్టోబర్ 27న రాత్రి రాచపల్లి జడ్‌పీహెచ్‌ఎస్ స్కూల్ ఆఫీస్ గది తాళం పగులగొట్టి బీరువా తెరిచి ఉంచారు. అలాగే రెండు క్లాస్‌రూమ్‌ల తాళాలను పాక్షికంగా దెబ్బతీశారు. ఒక ఖాళీ ల్యాప్‌టాప్ బ్యాగ్ ఆఫీస్ నుంచి దొంగలించారని, క్లాస్‌రూమ్‌లో నల్ల క్యారీ బ్యాగ్‌లో ఉన్న కొన్ని డాక్యుమెంట్ పేపర్లు పడి ఉన్నాయని చెప్పారు. కాగా రాచపల్లి బస్టాండ్ సమీపంలోని కిరాణా షాప్, టిఫిన్ సెంటర్, సలూన్ షాప్‌ల తాళాలు కూడా పగులగొట్టినట్లు సమాచారం. ఈ ఘటనలపై నారన్న అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు ఇల్లందకుంట ఎస్‌ఐ కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.


