కొలనూరుకు ఆర్ఓబీ మంజూరు
ఓదేలు కోసం కృషి కొనసాగుతుంది :ఎంపీ వంశీకృష్ణ
ఆర్ఎఫ్సీఎల్ రామగుండంలో మిస్ మేనేజ్మెంట్పై కేంద్రానికి లేఖలు
కాకతీయ, పెద్దపల్లి : కొలనూరు ప్రాంతానికి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ (ఆర్ఓబీ) మంజూరు కావడం స్థానిక ప్రజలకు ఆనందకరమైన విషయమని పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు గడ్డం వంశీకృష్ణ తెలిపారు. కొలనూరు, ఓదేలు ప్రాంతాల్లో రైల్వే గేటు కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను రైల్వే అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు.
రైల్వే అధికారులు కొలనూరు ప్రాంతాన్ని సందర్శించిన సమయంలో తాను వారితో కలిసి ప్రత్యక్షంగా పరిశీలన నిర్వహించానని తెలిపారు. ఆ సమయంలో ఓదేలు ప్రాంతానికి కూడా అత్యవసరంగా ఆర్ఓబీ అవసరం ఉందని వివరించినట్లు చెప్పారు. ప్రారంభంలో రైల్వే శాఖ కొలనూరుకు మాత్రమే ఆర్ఓబీ మంజూరు చేసి, ఓదేలు ప్రాంతానికి సాధ్యం కాదని తెలిపిందన్నారు.అయితే ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని తాను నిరంతరం ప్రయత్నాలు కొనసాగించడంతో కొలనూరు ప్రాంతంలో రైల్వే శాఖ స్వంత ఖర్చులతో ఆర్ఓబీ నిర్మాణానికి అంగీకరించినట్లు తెలిపారు. అదే విధంగా ఓదేలు ప్రాంతానికి కూడా ఆర్ఓబీ మంజూరు అయ్యేలా కృషి కొనసాగిస్తామని స్పష్టం చేశారు. రెండు ప్రాంతాల్లో ప్రజల సమస్యలు శాశ్వతంగా పరిష్కారం కావడానికి తాము కట్టుబడి ఉన్నామని చెప్పారు.
ఇదిలా ఉండగా, పెద్దపల్లి నియోజకవర్గంలోని ఆర్ఎఫ్సీఎల్ రామగుండం సంస్థ నిర్వహణపై కూడా ఎంపీ వంశీకృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు. సంస్థలో మిస్ మేనేజ్మెంట్, నిర్లక్ష్యం జరుగుతోందని కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డాకు పలుమార్లు లేఖలు రాసినట్లు తెలిపారు. వ్యక్తిగతంగా కలసి సమస్యలను వివరించినప్పటికీ సరైన స్పందన రాలేదని అన్నారు.
ప్రస్తుతం ఆర్ఎఫ్సీఎల్ రామగుండం సంస్థలో ఉత్పత్తి సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించడం లేదని, సుమారు 70 శాతం మాత్రమే ఉత్పత్తి కొనసాగుతోందని పేర్కొన్నారు. సంస్థ హెడ్ ఆఫీస్ ఢిల్లీలో ఉండటంతో స్థానిక సమస్యలపై తగిన శ్రద్ధ ఉండడం లేదని, అందుకే హెడ్ ఆఫీస్‌ను హైదరాబాద్‌కు మార్చాలని పలుమార్లు విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు.గతంలో మూతపడిన ఆర్ఎఫ్సీఎల్ సంస్థను తిరిగి ప్రారంభించేందుకు మాజీ కేంద్ర మంత్రి జి. వెంకటస్వామి కృషి చేశారని గుర్తుచేశారు. అనంతరం వివేక్ ఎంపీగా ఉన్న సమయంలో కూడా ఎంతో శ్రమించి సంస్థను మళ్లీ ప్రొడక్షన్లోకి తీసుకువచ్చారని చెప్పారు. ఈ సంస్థ ద్వారా స్థానిక యువతకు ఉపాధి లభించిందని వివరించారు.రామగుండం ఆర్ఎఫ్సీఎల్ ద్వారా తెలంగాణకు యూరియా సరఫరా జరగడంతో పాటు ఇతర రాష్ట్రాలకు కూడా ఎరువులు పంపిణీ అయ్యేదని తెలిపారు. ప్రస్తుతం యూరియా నిర్వహణలో గందరగోళం నెలకొన్నదని, ఉత్పత్తి సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించకపోవడం వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని ఎంపీ వంశీకృష్ణ స్పష్టం చేశారు.


