కాకతీయ, కరీంనగర్ బ్యూరో : కరీంనగర్ కేబుల్ బ్రిడ్జి పైన రోడ్డు వేయకపోవడం, సరైన లైటింగ్ ఏర్పాటు లేకపోవడంతో తీవ్రంగా ప్రమాదాలు జరుగుతున్నాయని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (ఏఐఏఫ్‌బీ) కరీంనగర్ జిల్లా కమిటీ విమర్శించింది. ఇప్పటివరకు 15 ఆక్సిడెంట్లు జరిగాయని, ఈ ప్రమాదాలలో ముగ్గురు చనిపోయారని ఈ విషయంలో ముగ్గురు మంత్రులు, అధికారులు, నగరపాలక సంస్థ బాధ్యత ఉన్నదని ఏఐఏఫ్‌బీ జిల్లా కమిటీ ఆరోపించింది. పార్టీ ఆధ్వర్యంలో కేబుల్ బ్రిడ్జిపై రోడ్డు వేయడం, హైమాస్టు లైటింగ్ ఏర్పాటు చేయడం, చౌరస్తా సుందరీకరణ చేపట్టడం కోసం రాస్తారోకో, ధర్నా నిర్వహించారు. స్మార్ట్ సిటీ అభివృద్ధిలో జరిగిన అవినీతి అంశాలపై సమగ్ర విచారణ జరపాలని నాయకులు డిమాండ్ చేశారు.
ఏఐఏఫ్‌బీ జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్ మాట్లాడుతూ ముగ్గురు మంత్రులు ఉన్నప్పటికీ కేబుల్ బ్రిడ్జి తగిన అభివృద్ధి జరుగడం లేదని, కోట్ల రూపాయల ప్రాజెక్టులు అవినీతితో నాశనం అవుతున్నాయన్నారు. అలాగే రోడ్లు గుంతలతో నిండిపోయి ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోడం లేదని ఆయన అగ్రహం వ్యక్తం చేశారు. ఆవుల ఆదిత్య మాట్లాడుతూ అసంపూర్తిగా పూర్తయిన తీగల వంతెన పనులు, రోడ్డు, ఫుట్‌పాత్‌లలో గుంతల కారణంగా ప్రమాదాలు ఎక్కువ అయ్యాయని వెంటనే రోడ్డు పునర్నిర్మాణం చేసి హైమాస్టు లైటింగ్, సైన్ బోర్డ్స్ ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమంలో ఏఐఏఫ్‌బీ జిల్లా కమిటీ సభ్యులు కె.బద్రి నేత, పార్టీ నాయకులు సాయి అనురాగ్, ఆనంద్, శ్రవణ్, పవన్, రఘు, సాయి కిరణ్ రెడ్డి, సాయి కిరణ్ రావు, పవన్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.


