రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత
ట్రాఫిక్ నియమాలు పాటిస్తేనే ప్రమాదాల తగ్గింపు
అతివేగం, మద్యం డ్రైవింగ్ ప్రాణాంతకం
హుజురాబాద్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కంచే వేణు
కాకతీయ, హుజురాబాద్ : రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటించినప్పుడే రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని హుజురాబాద్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కంచే వేణు తెలిపారు. హుజురాబాద్ లారీ అసోసియేషన్ కార్యాలయంలో రహదారి భద్రత, ట్రాఫిక్ నియమాలపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఇంటి నుంచి బయలుదేరే ప్రతి వాహనదారుడి కోసం కుటుంబ సభ్యులు ఎదురు చూస్తుంటారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ప్రమాదాల్లో కుటుంబ పెద్దను కోల్పోతే ఆ కుటుంబం తీవ్ర ఆర్థిక, మానసిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు.
హెల్మెట్, సీటుబెల్ట్ తప్పనిసరి
ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించకుండా ప్రయాణించరాదని, కార్లు నడిపేవారు సీటుబెల్ట్ తప్పనిసరిగా పెట్టుకోవాలని తెలిపారు. అతివేగమే ఎక్కువ ప్రమాదాలకు ప్రధాన కారణమని, మద్యం సేవించి వాహనం నడపడం ప్రాణాంతకమని హెచ్చరించారు. మొబైల్ ఫోన్లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం కూడా ప్రమాదాలకు దారితీస్తుందన్నారు. అధిక వేగంతో వాహనాలు నడపడం వల్లే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని, ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ ఇతరులకు ఇబ్బంది కలగకుండా జాగ్రత్తగా వాహనాలు నడపాలని సూచించారు. రోడ్డు భద్రతపై ప్రజలకు పూర్తి స్థాయి అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రయాణికులను తరలించే ఆటోలు, జీపులు, ప్రైవేటు వాహనాలు నిర్ణీత పరిమితికి మించి ప్రయాణికులను తీసుకెళ్లకూడదన్నారు. ప్రమాదాల నివారణకు నిరంతరం వాహన తనిఖీలు నిర్వహిస్తున్నామని, మద్యం తాగి వాహనాలు నడిపేవారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో రవాణా శాఖ సిబ్బంది, ట్రాన్స్పోర్ట్ కానిస్టేబుల్ కత్తుల నాగరాజు, హోంగార్డ్ బుర్ర సురేష్, లారీ అసోసియేషన్ ఓనర్లు, డ్రైవర్లు పాల్గొన్నారు.


