రోడ్డు భద్రత అవగాహన మాసోత్సవాలు
కాకతీయ, రాజన్న సిరిసిల్ల : జిల్లాలో రోడ్డు ప్రమాదాలను తగ్గించి ప్రజల ప్రాణాలను రక్షించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం జనవరి 1 నుంచి 31 వరకు జాతీయ రోడ్డు భద్రత అవగాహన మాసోత్సవాలను నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే తెలిపారు.ఈ సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో రోడ్డు భద్రత అవగాహన మాసోత్సవాలకు సంబంధించిన పోస్టర్లను అధికారులతో కలిసి ఎస్పీ ఆవిష్కరించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.మాసోత్సవాల సందర్భంగా జిల్లావ్యాప్తంగా రోడ్డు భద్రత, ట్రాఫిక్ నియమాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించే కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. హెల్మెట్, సీట్‌బెల్ట్ వినియోగం, మద్యం సేవించి వాహనం నడపరాదనే అంశం, అధిక వేగం నివారణ, ట్రాఫిక్ సంకేతాల పాటింపు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు చెప్పారు. పాఠశాలలు, కళాశాలలు, ప్రధాన చౌరస్తాలు, బస్టాండ్‌లు తదితర ప్రజా రద్దీ ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టి ప్రజలను చైతన్యవంతులను చేయనున్నట్లు తెలిపారు. రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, ట్రాఫిక్ నియమాలను పాటించడం ద్వారా ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో వేములవాడ ఏఎస్పీ రుత్విక్ సాయి ఐపీఎస్, అదనపు ఎస్పీ చంద్రయ్య, డీటీఓ లక్ష్మణ్, ఎంవీఐ వంశిధర్, ఏఎంవీఐ రజినీ దేవి, ఏఎంవీఐ పృథ్వీరాజ్ వర్మ తదితరులు పాల్గొన్నారు


