రోడ్డు రాజకీయం… ప్రజలకే గోసలు!!
ఎమ్మెల్యే వర్సెస్ మాజీ ఎమ్మెల్యేల మధ్య పోటాపోటీ రాజకీయం
నిలిచిపోయిన డబుల్ రోడ్డు పనులు
కోర్టుకెక్కిన వ్యాపారులు… నత్తనడకన నిర్మాణం
పేరుకు డబుల్… వాస్తవానికి సింగిల్ రహదారి
సెంట్రల్ లైటింగ్ ఉన్నా… ప్రజలకు అందని సౌకర్యం
కాకతీయ, మహబూబాబాద్ ప్రతినిధి: మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలో 34వ వార్డు నెహ్రూ సెంటర్ నుంచి 20వ వార్డు మంగళ్ కాలనీ వరకు సాగాల్సిన రహదారి అభివృద్ధి పనులు రాజకీయ పోరాటానికి బలైపోయాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మాజీ ఎమ్మెల్యే ప్రారంభించిన ఈ డబుల్ రోడ్డు నిర్మాణం, ప్రస్తుత ఎమ్మెల్యే కాలంలో కూడా పూర్తి స్థాయికి రాకపోవడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత ఆరు–ఏడు ఏళ్లుగా సాగుతున్న ఈ రహదారి పనులు రోడ్డు వెడల్పు కారణంగా ఇరువైపుల వ్యాపారులు, ఇల్లు యజమానులు సెట్‌బ్యాక్ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొంతమంది వ్యాపారులు కోర్టును ఆశ్రయించి స్టే ఆర్డర్లు తెచ్చుకోవడంతో పనులు మధ్యలోనే ఆగిపోయాయి. కంకర, డస్ట్, అక్కడక్కడ సీసీ రోడ్డు వేసినప్పటికీ పూర్తి స్థాయిలో రహదారి అందుబాటులోకి రాలేదు.
ఎన్నికల్లో ఎజెండా… అమల్లో ఆలస్యం
మున్సిపల్ ఎన్నికల్లో ఈ రహదారి ప్రధాన ఎజెండాగా మారింది. ఒకవైపు వ్యాపారులు రోడ్డు వెడల్పుకు అంగీకరిస్తే, మరోవైపు కొందరు వ్యాపారులు తీవ్రంగా వ్యతిరేకించి కోర్టు నుంచి డిక్రీ తెచ్చుకోవడంతో పనులు నిలిచిపోయాయి. ఇరువురు ఎమ్మెల్యేలు ప్రయత్నాలు చేసినప్పటికీ నిర్మాణం పూర్తికాకపోవడం ప్రజల్లో నిరాశ కలిగిస్తోంది. నెహ్రూ సెంటర్ నుంచి ఐఎంఏ బిల్డింగ్ వరకు సెంట్రల్ లైటింగ్‌తో డబుల్ రోడ్డు నిర్మాణం ప్రారంభమైనా పూర్తికాలేదు. కొంతదూరం మాత్రమే సెంట్రల్ లైటింగ్‌తో కూడిన రహదారి అందుబాటులోకి రాగా, మిగతా భాగం సింగిల్ రోడ్డు రూపంలోనే ఉంది. పత్తిపాక శివారు దాకా పనులు సాగి ఆ తర్వాత నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. వృద్ధులు, చిన్నారులు ధూళి, కాలుష్యంతో ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధుల నుంచి స్పష్టమైన చర్యలు కనిపించలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కేంద్రంగా ఎదిగిన మహబూబాబాద్‌లో కీలక రహదారి పూర్తికాకపోవడం ప్రజల్లో అసంతృప్తి రేపుతోంది. ప్రస్తుతం ఈ రహదారి వాహనాల పార్కింగ్ స్థలంగా మారిపోవడంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. “అధికారులు ఉన్నట్టా..? లేనట్టా..?” అన్న ప్రశ్న ప్రజల్లో మళ్లీ మళ్లీ వినిపిస్తోంది.


