రోడ్డు ప్రమాదాల నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత
నిబంధనలు పాటిస్తేనే ప్రాణ రక్షణ : సీఐ విశ్వేశ్వర్
గొర్రెకుంట క్రాస్‌లో ‘అరైవ్ అలైవ్’ అవగాహన కార్యక్రమం
కాకతీయ, గీసుగొండ : రోడ్డు ప్రమాదాల నివారణను ప్రతి ఒక్కరూ వ్యక్తిగత బాధ్యతగా భావించినప్పుడే ప్రమాదాలను తగ్గించగలమని గీసుగొండ సీఐ డి. విశ్వేశ్వర్ అన్నారు. గొర్రెకుంట క్రాస్ వద్ద ‘అరైవ్ అలైవ్’ రోడ్ సేఫ్టీ అవగాహన కార్యక్రమాన్ని ఆటో డ్రైవర్లు, ప్రజలతో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాహనాలు నడిపేటప్పుడు నిర్ణీత వేగ పరిమితులను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించడం, నాలుగు చక్రాల వాహనదారులు సీటుబెల్ట్ వినియోగం చేయడం అత్యవసరమని స్పష్టం చేశారు. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల అనేక ప్రాణనష్టాలు సంభవిస్తున్నాయని, చిన్నపాటి నిర్లక్ష్యమే పెద్ద ప్రమాదాలకు దారితీస్తుందని హెచ్చరించారు. ట్రాఫిక్ సిగ్నల్స్‌ను గౌరవించడం, వన్‌వే నిబంధనలను పాటించడం, ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడపకూడదని, పాదచారులకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. రోడ్డు భద్రతపై ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించినప్పుడే ప్రమాదాలను నివారించవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ కుమార్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.


