హుజురాబాద్‌లో రోడ్డు ప్రమాదం
సీనియర్ పాత్రికేయుడు హర్షవర్ధన్ కు గాయాలు
అతి వేగంగా దూసుకొచ్చిన బైక్ ఢీ సైలెన్సర్ శబ్ద కాలుష్యంపై ప్రజల ఆవేదన
కాకతీయ,హుజురాబాద్ : హుజురాబాద్ పట్టణంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో సీనియర్ పాత్రికేయుడు గడ్డం హర్షవర్ధన్ గాయపడ్డారు. పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఎదుట ఈ ఘటన చోటుచేసుకుంది.వివరాల్లోకి వెళ్తే. సీనియర్ పాత్రికేయులు హర్షవర్ధన్ తన ద్విచక్ర వాహనాన్ని కార్యాలయం ముందు నిలిపి మిత్రులతో మాట్లాడుతుండగా, అన్నపూర్ణ థియేటర్ వైపు నుంచి యమహా బైక్‌పై వచ్చిన ఓ యువకుడు అతి వేగంగా దూసుకొచ్చి ఆయన వాహనాన్ని ఢీకొట్టాడు. ఆ బైక్‌కు సైలెన్సర్ తొలగించడంతో ఘోర శబ్ద కాలుష్యం నెలకొంది. వాహనాన్ని అజాగ్రత్తగా నడపడంతో నిలిచి ఉన్న హర్షవర్ధన్‌ను ఢీ కొట్టిన యువకుడు ప్రమాదానికి కారణమయ్యాడు.ఆ ఢీకొట్టే బలానికి హర్షవర్ధన్ నేలకూలి కాలికి గాయమైంది. సైలెన్సర్ వేడికి కాలిన గాయం కూడా అయ్యింది. ప్రమాదంలో ఆయన ద్విచక్ర వాహనం దెబ్బతినగా, వద్ద ఉన్న రెండు మొబైల్ ఫోన్లు పూర్తిగా పగిలిపోయాయి.సమాచారం అందుకున్న హుజురాబాద్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని, ప్రమాదానికి కారణమైన యువకుడిని,వాహనాన్ని అదుపులోకి తీసుకున్నారు. గాయపడిన హర్షవర్ధన్‌ను హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యులు ప్రాథమిక చికిత్స అందించారు.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.పట్టణంలో కొందరు యువకులు వాహనాల సైలెన్సర్‌లు తీసివేసి శబ్ద కాలుష్యానికి కారణమవడం, అతి వేగంగా బైకులు నడపడం అలవాటుగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.ఈ నిర్లక్ష్య ధోరణి వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయి. పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలి అని పట్టణ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.


