మడికొండ సెంటర్‌లో రోడ్డు ప్రమాదం.. గుర్తుతెలియని వ్యక్తి మృతి
కాకతీయ, మడికొండ : మడికొండ సెంటర్‌లోని జీఎం ఎంటర్ప్రైజెస్ ముందు హైదరాబాద్ రూట్ మెయిన్ రోడ్డుపై బుధవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సాయంత్రం సుమారు 6 గంటల సమయంలో గుర్తుతెలియని లారీ ఢీకొనడంతో సుమారు 40 ఏళ్ల వయసు గల గుర్తుతెలియని మగ వ్యక్తి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. లారీ ఢీకొట్టడంతో తీవ్రంగా తలకు గాయమై మృతి చెందినట్లు సమాచారం. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి మార్చురీకి మృతదేహాన్ని తరలించారు. మృతుడి వివరాలు ఇప్పటివరకు తెలియరాలేదని పోలీసులు తెలిపారు. అతడు ఇతర రాష్ట్రానికి చెందిన కూలీగా అనుమానిస్తున్నట్లు పేర్కొన్నారు. మృతుడి గుర్తింపు కోసం ప్రజలు, వివిధ గ్రూపుల్లో సమాచారం షేర్ చేయాలని పోలీసులు కోరుతున్నారు. సంబంధిత వివరాలు తెలిసిన వారు సమీప పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు.


