మానేరు ఒడ్డున కర్మకాండ నిలయం
రూ.15 లక్షల సీఎస్‌ఆర్ నిధులతో భవన నిర్మాణం
భూమి పూజలో పాల్గొన్న బీజేపీ నేతలు, మాజీ మేయర్లు
కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ పట్టణంలోని మానేరు ఒడ్డున తీగల బ్రిడ్జి సమీపంలో, హనుమాన్ దేవాలయం పక్కన నూతన కర్మకాండ నిలయాన్ని నిర్మించేందుకు చర్యలు చేపట్టారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ చొరవతో రూ.15 లక్షల కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్‌ఆర్) నిధులతో ఈ భవనాన్ని నిర్మించనున్నారు. శనివారం కర్మకాండ నిలయ భవన పనులకు అర్చకుడు పేరుకల రాజయ్య భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు, మాజీ మేయర్లు డి. శంకర్, సునీల్ రావు, మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిలపు రమేష్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బంగారు రాజేంద్రప్రసాద్, సాయిని మల్లేశం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ… పట్టణంలో సొంత ఇళ్లు లేని పేద కుటుంబాలు అంత్యక్రియల సమయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని తెలిపారు. అద్దె ఇళ్ల వద్ద కర్మకాండలు నిర్వహించలేని పరిస్థితుల్లో పేదలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఈ సమస్యను గుర్తించిన కేంద్ర మంత్రి బండి సంజయ్, పేదల కోసం అవసరమైన సదుపాయాలతో కర్మకాండలు నిర్వహించుకునేలా ప్రత్యేక భవనం నిర్మిస్తున్నారని తెలిపారు. ఈ నిలయం పేద, నిరుపేద కుటుంబాలకు ఉపశమనం కలిగించనుందని అన్నారు.


