కాకతీయ, ములుగు ప్రతినిధి: ములుగు జిల్లా పోలీస్ కార్యాలయంలో నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీకి చెందిన ముగ్గురు సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నగదు రివార్డులు శనివారం అందజేశారు. జిల్లా ఎస్పీ శబరీష్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో లొంగిపోయిన మావోయిస్టు సభ్యులు మడవి మంగ్లీ @ మాసే, మడకం కమలేష్, మడకం భీమేలకు రూ.25,000 చొప్పున తక్షణ సహాయం, అలాగే వారి క్యాడర్ స్థాయికి అనుగుణంగా మిగిలిన రివార్డు మొత్తాలను చెక్కుల రూపంలో అందజేశారు.
మడవి మంగ్లీకి రూ.3.75 లక్షలు, మడకం కమలేష్, మడకం భీమేలకు ఒక్కొక్కరికి రూ.75 వేల చొప్పున అందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అత్యుత్తమ సరెండర్ పాలసీని అమలు చేస్తోందని, లొంగిపోయిన మావోయిస్టులకు నగదు రివార్డు, వైద్య సహాయం, పునరావాస సాయం అందిస్తోందన్నారు. సమాజంలో తిరిగి స్థిరపడేందుకు అన్ని విధాల మద్దతు ప్రభుత్వం ఇస్తోందని.. అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు కూడా సమాజంలో కలిసిపోవాలని ములుగు పోలీస్ విజ్ఞప్తి చేస్తోందని తెలిపారు.
అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు బయటకు రావాలనుకుంటే ములుగు పోలీసులు పూర్తి భద్రత కల్పించి, పునరావాసం అందజేస్తారని ఎస్పీ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో డి.ఎస్.పి (ఇన్‌చార్జ్ ఓఎస్‌డీ) రవీందర్, ఆర్‌ఐ తిరుపతి తదితరులు పాల్గొన్నారు.


