కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో భూ సంస్కరణలు ఎన్నో చేసినా, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు మాత్రం అలాగే కొనసాగుతున్నాయి. ముఖ్యంగా భూ భారతి, పాస్‌బుక్ మార్పులు, రికార్డు ఎంట్రీల విషయంలో సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లంచం కోసం రెవెన్యూ అధికారులు సృష్టిస్తున్న అడ్డంకులు ఒక కుటుంబాన్ని ప్రాణాలు తీసుకునే స్థితికి నెట్టేశాయి.
మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండలం బస్వాయిపల్లికి చెందిన ఆటో డ్రైవర్ శంకర్ తన తాత పేరిట ఉన్న 1.28 ఎకరాల ఇనాం భూమిని తన పేరుపై మార్చుకోవాలని తహసీల్దారు కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నాడు. దరఖాస్తు ఆన్‌లైన్‌లో ఆర్డీవో కార్యాలయానికి వెళ్లినా, ఆఫ్‌లైన్‌లో రాలేదని సిబ్బంది చెప్పడంతో కేసు నిలిచిపోయింది.
ఈ లోగా రెవెన్యూ ఇన్స్పెక్టర్ (ఆర్ఐ) సాహత్, దస్త్రం ముందుకు కదిలించాలంటే రూ.15 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడని శంకర్ ఆరోపించాడు. అంత మొత్తం లేని కారణంగా రూ.5 వేలు ఇచ్చానని, మిగతా మొత్తాన్ని ఇస్తేనే ఫైలు కదులుతుందని అధికారులు స్పష్టం చేశారని బాధితుడు వెల్లడించాడు.
అధికారుల ఈ లంచం వేధింపులతో తీవ్ర మనస్తాపానికి గురైన శంకర్, చివరకు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తన ఆటోపై పెట్రోలు పోసి, తన భార్య జ్యోతి, ముగ్గురు కుమార్తెలతో కలిసి ప్రాణాలు తీసుకోవాలని ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఆటోకు నిప్పంటుకోవడంతో శంకర్ చేతులు, ఆటో పూర్తిగా కాలిపోయాయి.
ప్రభుత్వం ఎన్నో సార్లు లంచం రహిత పాలన, పారదర్శకతపై హామీలు ఇచ్చినా, కింది స్థాయి రెవెన్యూ అధికారుల అవినీతి ప్రజల జీవితాలను చీకటిలోకి నెడుతోంది. రైతులు, పేదలు, కూలీలు, ఎవరి హక్కుల భూములైనా భూ హారతి పేరుతో రికార్డు మార్చుకోవాలంటే లంచం తప్పనిసరి అవుతోంది. ఈ ఘటన మరోసారి రెవెన్యూ వ్యవస్థలో మార్పులు అవసరమని గట్టిగా చెబుతోంది.
ప్రజలకు భూమి హక్కులు ఇవ్వాలనే ఉద్దేశ్యంతో ప్రవేశపెట్టిన సంస్కరణలు చివరికి లంచాల బాట పట్టి, పేదవారి ప్రాణాలను పణంగా పెట్టే స్థాయికి వెళ్లడం దురదృష్టకరం. శంకర్ కుటుంబం చేసిన ఆత్మహత్యాయత్నం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.


