రేవంత్ అబద్ధాల రాజకీయాలు
బడ్జెట్ ప్రసంగం సాక్షిగా బయటపడ్డాయి
అసెంబ్లీ వేదికగా సీఎం ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు
ఎమ్ముల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్
కాకతీయ, హైదరాబాద్ : అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అబద్ధాలు చెబుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ తీవ్ర విమర్శలు చేశారు. అబద్ధాలు, మోసాల పునాదుల మీదే ఆయన రాజకీయాలు సాగుతున్నాయని అన్నారు. తెలంగాణ భవన్లో నిర్వహించిన ప్రెస్ మీట్లో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి సీఎం కాకముందే ప్రజలను మోసం చేయడం తన స్వభావమని బయటపెట్టారని అన్నారు. కేసీఆర్‌పై పనిగట్టుకుని బురద చల్లడం ఆయన రాజకీయ అజెండాగా మారిందని విమర్శించారు. రాష్ట్ర అప్పుల విషయంలో సీఎం విభిన్నంగా మాట్లాడుతున్నారని శ్రవణ్ ఆరోపించారు. ఒకవైపు 3 లక్షల 47 వేల కోట్ల రూపాయల అప్పు తెచ్చామని చెప్పడం, మరోవైపు 3 లక్షల 30 వేల కోట్ల అప్పు కట్టామని చెప్పడం విరుద్ధ వ్యాఖ్యలని అన్నారు. కేసీఆర్ 8 లక్షల కోట్ల అప్పు చేశారని దుష్ప్రచారం చేస్తున్నారని, వాస్తవానికి ప్రభుత్వం కట్టిన అప్పు లక్షా 67 వేల కోట్లు మాత్రమేనని స్పష్టం చేశారు. అసెంబ్లీలో సీఎం అబద్ధాలు మాట్లాడితే ప్రజలే తీర్పు చెప్పాలని ఆయన అన్నారు. గవర్నర్ ప్రసంగాన్ని తాను మండలిలో ప్రశ్నిస్తే అభ్యంతరం తెలిపిన ప్రభుత్వం, సీఎం అబద్ధాలపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. బడ్జెట్‌పై కూడా ఆయన తీవ్ర విమర్శలు చేశారు. బడ్జెట్‌ను చీట్ చేసే సీఎం ఎక్కడైనా ఉంటారా అని ప్రశ్నించారు. ఆరు గ్యారెంటీల అమలుపై కేటీఆర్ ప్రయివేటు మెంబర్ బిల్లును ప్రవేశపెట్టనున్నారని, దీనికి సభ్యులు మద్దతు ఇవ్వాలని కోరారు. విద్యా శాఖకు కేటాయింపులు తగ్గించారని, 2026-27 బడ్జెట్లో కేవలం 8 శాతం మాత్రమే నిధులు ఇవ్వడం దారుణమని అన్నారు. ఈ అంశంపై విద్యా కమీషన్ చైర్మన్ ఆకునూరి మురళితో పాటు సభ్యులు స్పందించాలని డిమాండ్ చేశారు. విద్యా శాఖను సీఎం భ్రష్టు పట్టిస్తున్నారని శ్రవణ్ ఆరోపించారు.


