రేవంత్ రెడ్డి ‘డైవర్షన్ పాలిటిక్స్’
హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం
వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకు కేసీఆర్‌కు నోటీసులు
మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఫైర్
వరంగల్ చౌరస్తాలో బీఆర్ఎస్ నిరసన.. స్తంభించిన ట్రాఫిక్
నన్నపునేని అరెస్టు చేసిన పోలీసులు
కాకతీయ, వరంగల్ ప్రతినిధి : తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత *కేసీఆర్*పై సిట్ విచారణకు వ్యతిరేకంగా వరంగల్ నగరం ఆదివారం ఉద్రిక్తతకు కేంద్రంగా మారింది. రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగానే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విచారణకు ఆదేశించిందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు భారీగా రోడ్లెక్కాయి. వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ నేతృత్వంలో వరంగల్ చౌరస్తాలో నిర్వహించిన నిరసనతో పరిసర ప్రాంతాలు కాసేపు రణరంగాన్ని తలపించాయి. నిరసన సందర్భంగా నన్నపునేని నరేందర్ మాట్లాడుతూ… ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన పాలనా అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికే ‘డైవర్షన్ పాలిటిక్స్’ చేస్తున్నారని తీవ్రంగా మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ వంటి అంశాలను అడ్డుపెట్టుకొని కేసీఆర్ ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ అరెస్టులతో ఉక్కుపాదం మోపడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్‌రావుల జోలికి వస్తే నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలే కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.

పోలీసుల జోక్యంతో ఉద్రిక్తత
నిరసన ఉధృతం కావడంతో వరంగల్ చౌరస్తాలో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ఆందోళనకారులను పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట చోటుచేసుకుని ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో పోలీసులు నన్నపునేని నరేందర్‌తో పాటు పలువురు ముఖ్య బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను బలవంతంగా అదుపులోకి తీసుకుని వాహనాల్లో ఎక్కించి ఇంతెజార్ గంజ్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
నన్నపునేని నరేందర్ అరెస్ట్ వార్త వ్యాపించగానే వరంగల్ నలుమూలల నుంచి బీఆర్ఎస్ శ్రేణులు భారీగా ఇంతెజార్ గంజ్ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. స్టేషన్ ముందు బైఠాయించి ప్రభుత్వానికి, స్థానిక మంత్రి *కొండా సురేఖ*కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అరెస్టు చేసిన వారిని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేయడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి.



