కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాజకీయాల్లో కొత్త వివాదం హాట్ టాపిగ్గా మారింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మీడియా సమావేశం ఏర్పాటు చేసి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హరీశ్ రావు వెనక నిలబడ్డారని ఆరోపించడంతో వివాదం మొదలైంది. కవిత చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గట్టి కౌంటర్ ఇచ్చారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందిస్తూ.. కవిత వెనక నేను ఉన్నానంటారు, హరీశ్ రావు వెనక ఉన్నానంటారు, మరికొందరు సంతోష్ రావు వెనక ఉన్నానంటారు. అసలు ఎవరి వెనకాలూ నేను లేను. నన్ను ప్రజలు ఎన్నుకున్నారు. ఇప్పటికే ప్రజలు వారిని తిరస్కరించారు. ప్రజలే తిరస్కరించిన వారితో కలిసే అవసరం నాకు లేదు అని వ్యాఖ్యానించారు. రేవంత్ మాట్లాడుతూ, తాను కుల రాజకీయాలు లేదా కుటుంబ రాజకీయాలు చేయనని స్పష్టం చేశారు. మీ కుల, కుటుంబ పంచాయతీల మధ్య నన్ను లాగొద్దు. నేను ప్రజలతో ఉన్నాను, ప్రజల సమస్యల పరిష్కారానికే కట్టుబడి ఉంటాను. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమమే నా లక్ష్యం అని ఆయన స్పష్టం చేశారు.
బీఆర్ఎస్ నేతలు పదే పదే తప్పుడు ప్రచారంతో ప్రజల్లో గందరగోళం సృష్టించాలని చూస్తున్నారని రేవంత్ వ్యాఖ్యానించారు. వాళ్లకు ప్రజల్లో విశ్వాసం లేకపోవడంతోనే ఇలాంటి మాటలు చెబుతున్నారు. ఎన్నికల్లో ప్రజలు వాళ్లకు తగిన గుణపాఠం చెప్పారు. అయినా కూడా ఇంకా నాపై బురద జల్లేందుకు ప్రయత్నిస్తున్నారు అని ఆయన విమర్శించారు. ప్రజలతో కలసి పాలన కొనసాగించడం, అభివృద్ధి పనులను వేగవంతం చేయడం, సంక్షేమ పథకాలపై దృష్టి పెట్టడమే తమ ప్రాధాన్యం అని రేవంత్ తెలిపారు. వ్యక్తిగత ఆరోపణలు, రాజకీయ దాడులు తనను వెనక్కి తగ్గించలేవని, ప్రజలే తన బలం అని పేర్కొన్నారు.


