కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తన మనసులోని మాటను మరోసారి బహిరంగ వేదికపై వ్యక్తం చేశారు. నాకు పదేళ్లు సమయం ఇవ్వండి. హైదరాబాద్ ఫ్యూచర్ సిటీని న్యూయార్క్, దుబాయ్‌లతో పోటీ పడేలా అభివృద్ధి చేస్తాను అని ఆయన ప్రకటించారు.
ఫ్యూచర్ సిటీ ప్రాజెక్ట్ పై మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి .. “న్యూయార్క్‌లో నివసిస్తున్నవారు కూడా రాబోయే రోజుల్లో మన ఫ్యూచర్ సిటీకి వస్తారు. మనం కూడా ఎందుకు పోటీగా ప్రపంచ స్థాయి సిటీని నిర్మించకూడదు?” అని ప్రశ్నించారు.అలాగే, ఫ్యూచర్ సిటీ నుంచి బెంగళూరుకు కనెక్టివిటీ కల్పించబోతున్నామని, బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ కోసం ఇప్పటికే కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించామని వెల్లడించారు. అమరావతి నుంచి చెన్నై వరకు బుల్లెట్ ట్రైన్ వస్తుంది. దానిని ఫ్యూచర్ సిటీకి కూడా కలుపుతాం అని సీఎం వివరించారు.
ప్రాజెక్ట్‌పై చిన్న చిన్న సమస్యలు వస్తే వాటిని కలసి పరిష్కరించుకోవాలని, కోర్టుల చుట్టూ తిరిగి సమయం వృథా చేసుకోవద్దని సూచించారు. ప్రభుత్వం ఎప్పుడూ మీ వెన్నంటే ఉంటుంది. పెట్టుబడిదారులను, డెవలపర్లను ఆదుకోవడానికి సిద్ధంగా ఉంది అని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.
ఫ్యూచర్ సిటీపై సీఎం చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ, వ్యాపార వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. హైదరాబాద్‌ను అంతర్జాతీయ స్థాయిలో తీసుకెళ్లే దిశగా ఇది కీలక అడుగు అవుతుందా అన్న చర్చ సాగుతోంది.


