కాకతీయ, తెలంగాణ బ్యూరో: స్వాతంత్ర్య దినోత్సవం పురస్కరించుకుని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గోల్కొండ కోటపై జాతీయ జెండాను ఎగురవేశారు. భారత ప్రజలకు 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దేశ స్వాతంత్ర్యం కోసం తమ జీవితాలు త్యాగం చేసిన మహనీయులకు నమస్కరిస్తున్నట్లు తెలిపారు. గాంధీజీ సారథ్యంలో సాగిన భారత స్వాతంత్ర పోరాటం.. ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. ప్రపంచంతో పోటీపడి నిర్ణయాలు తీసుకుంటూ తెలంగాణను ముందుకు తీసుకెళ్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. అహింస పద్ధతిలో మహా సంగ్రామాన్ని గెలిచామన్న ముఖ్యమంత్రి.. స్వాతంత్ర పోరాటంలో ప్రపంచానికి సరికొత్త మార్గంగా చూపించిందన్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం సాహసోపేత నిర్ణయాలతో సాగుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మరోవైపు పేదల సంక్షేమాలతో సరికొత్త మార్గం చూపించిన చరిత్ర అంటే కాంగ్రెస్ పాలనేనని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశంలో ఎక్కడలేని విధంగా 3.10 కోట్ల మందికి సన్నబియ్యం ఇస్తున్నామన్నారు. సన్న బియ్యం పథకం కేవలం ఆకలి తీర్చే పథకం కాదన్నారు. సన్న బియ్యం పథకం పేదల ఆత్మగౌరమానికి ప్రతీకా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ప్రజా ప్రభుత్వం వచ్చాకే పేదల సమస్యలు పరిష్కారమవుతున్నాయన్నారు. రేషన్ షాపులు పేదవాడి ఆఖరి తీర్చే భరోసా కేంద్రాలుగా మారాయని సీఎం ఈ సందర్భంగా తెలిపారు.
సామాజిక న్యాయం కాంగ్రెస్ పార్టీ డిఎన్ఏలో ఉందన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. సామాజిక, కుల, ఆర్థిక, రాజకీయ, విద్యా సర్వేను ఒక యజ్ఞంలా చేశామన్నారు. సామాజిక సర్వే చేసి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించామని.. మార్చి 2న బిల్లులు తెచ్చామని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పంపిన బీసీ బిల్లులను త్వరగా ఆమోదించాలని గోల్కొండ కోట నుంచి మరోసారి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.


