- తెలంగాణ సోయిలేని ప్రభుత్వం రాష్ట్రంలో ఉంది
- స్థానిక ఎన్నికల్లో పోటీపై ఇంకా నిర్ణయం తీసుకోలే…
- అక్టోబర్ 8న కోర్టు తీర్పును బట్టి తమ కార్యాచరణ ..
- తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత
కాకతీయ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ సోయిలేని ప్రభుత్వం రాష్ట్రంలో నడుస్తోందని, సీఎం రేవంత్ రెడ్డి ఎన్నడూ జై తెలంగాణ అనలేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. ముఖ్యమంత్రి బతుకమ్మ వేడుకల్లో పాల్గొనడం విచిత్రంగా అనిపించిందని, గిన్నిస్ బుక్ రికార్డుల కోసం పండుగ చేశారన్నారు. పదివేల మందితో బతుకమ్మ ఉత్సవాలు జరిపి ప్రభుత్వం ఆడబిడ్డలను అవమానించిందని మండిపడ్డారు. వచ్చే సంవత్సరం లక్షమంది మహిళలతో హైదరాబాద్‌లో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహిస్తామన్నారు.
చింతమడక నుంచి లండన్ వరకు ఆదరించారు
చింతమడక నుంచి లండన్ వరకు తెలంగాణ ప్రజలు తనను ఆదరించారని కవిత అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని, అక్టోబర్ 8వ తేదీన కోర్టు తీర్పును బట్టి తమ కార్యాచరణ ఉంటుందని స్పష్టంచేశారు. విద్య, ఉద్యోగాల్లో బీసీ రిజర్వేషన్లకు ఎలాంటి ఇబ్బందులు రావని, రాజకీయపరమైన రిజర్వేషన్లకు ఇబ్బంది వస్తుందన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చి రేవంత్ రెడ్డి దగ్గరి మనుషులు కోర్టుల్లో కేసులు వేశారని ఆరోపించారు.
ఈటల వ్యాఖ్యలు వ్యక్తిగతమా..?
బీసీ రిజర్వేషన్లకు చట్టబద్దత కల్పించాల్సిన బీజేపీ ఎన్నికలు జరిగితే కోర్టుల్లో క్యాన్సిల్ చేస్తామని అంటోందన్నారు. ఈటెల రాజేందర్ ఎన్నికల్లో పోటీ చేయవద్దు అని అంటున్నారని, బీజేపీ ఏమైనా కోర్టునా అన్నారు. ఈటెల రాజేందర్ బీసీ బిడ్డ, ఉద్యమకారుడు, ఎంపీగా ఎట్లా మాట్లాడతారన్నారు. ఈటెల మాటలు వ్యక్తిగతమా..బీజేపీ స్టాండా చెప్పాలన్నారు. గవర్నర్ దగ్గర పెండింగ్‌లో ఉన్న ఆర్డినెన్స్ గురించి బీజేపీ మాట్లాడాలని, ఢిల్లీ వెళ్లి మోడీ కాళ్ళు పట్టుకుని బీసీ రిజర్వేషన్లకు ఆమోదం తేవాలన్నారు. బీజేపీ తెలంగాణ బీసీలకు క్షమాపణ చెప్పాలన్నారు. రాష్ట్రంలో ఉన్న బీసీ బిడ్డలకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోబోమన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు ప్రజల ఆస్తి
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఊహించనిదని, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాలతో ప్రజల జీవితాల్లో మార్పులు రావన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రజల ఆస్తి అని, మేడిగడ్డ బ్యారేజీ రిపేర్ చేయాలని తెలంగాణవాదులు అంతా కోరుకున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం కాలయాపన చేసి ప్రజలను ఇబ్బందులు పెడుతోందన్నారు. రైతులకు యూరియా సైతం సరఫరా చేయలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందని కవిత విమర్శించారు.


