కాంగ్రెస్‌లో రేవంత్ జోష్
జూబ్లీహిల్స్ పీఠంపై హస్తం పార్టీ జెండా
ఉప ఎన్నిక గెలుపుతో పెరిగిన సీఎం ఇమేజ్
ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండో విజయం
కంటోన్మెంట్ ఉప ఎన్నిక తర్వాత మరో గెలుపు
బీఆర్ఎస్ సిట్టింగ్ సీట్లను దక్కించుకోవడంలో ఫలించిన వ్యూహం
అజార్‌కు మంత్రి పదవి.. నవీన్‌యాదవ్ ఎంపికలో బిగ్ స్ట్రాటజీ
బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులకు 2023 ఎన్నికల కంటే తక్కువ ఓట్లు
జూబ్లీహిల్స్ చరిత్రలోనే గతంలో ఏ అభ్యర్ధికి రానంత భారీ మెజార్టీ
ఇక స్థానిక సంస్థలు.. గ్రేటర్ హైదరాబాద్ టార్గెట్
తనపై వస్తున్న విమర్శలకు గెలుపుతో గట్టి సమాధానం
అటు పార్టీ, ఇటు ప్రభుత్వంలో రేవంత్ ఇక మరింత స్ట్రాంగ్ !
రాజకీయవర్గాల్లో ఆసక్తికర చర్చ
కాకతీయ, తెలంగాణ బ్యూరో: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఘన విజయం.. కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపగా.. రేవంత్‌రెడ్డి ఇమేజ్‌ను అమాంతం పెంచింది. ఉత్కంఠ పోరులో బీఆర్ఎస్ సిట్టింగ్ సీటును దక్కించుకోవడం వెనుక రేవంత్ వ్యూహం ఫలించింది. సీఎం అన్నీతానై ఒంటిచేత్తో పార్టీని విజయతీరాలకు చేర్చడం ఆయన నాయకత్వ పటిమకు నిదర్శమని చర్చ జరుగుతోంది.
ఉప ఎన్నికకు సంబంధించి చివరి వారం వరకు కాంగ్రెస్ నేతల్లో కాన్ఫిడెన్స్ కనిపించలేదు. ఈక్రమంలోనే రంగంలోకి దిగిన రేవంత్ .. తనదైన స్టైల్లో పోల్ మేనేజ్‌మెంట్‌లో సక్సెస్ అయ్యారు. స్వయంగా ప్రచారంలోకి దిగి నాయకులు, కార్యకర్తల్లో జోష్ నింపారు. మొత్తానికి తనపై ఇన్ని రోజులుగా వస్తున్న విమర్శలకు గెలుపుతో గట్టి సమాధానం చెప్పారు. జూబ్లీహిల్స్ గెలుపుతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పార్టీలో, ప్రభుత్వంలో మరింత స్ట్రాంగ్‌గా నిలవనున్నారని రాజకీయవర్గాల్లో టాక్ నడుస్తోంది.
అజార్‌కు మంత్రి పదవి..
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో క్షేత్రస్థాయిలో కేడర్ లేదన్న వాస్తవాన్ని రేవంత్ రెడ్డి ముందే గ్రహించారు. అందుకు అనుగుణంగానే పావులు కదిపారు. గతంలో పోటీ చేసిన అజారుద్దీన్‌ను పోటీకి నిలిపితే చెమటోడ్చాలన్న అంచనాకు వచ్చారు. అజారుద్దీన్‌ను బరిలోకి దింపితే మైనార్టీ ఓట్లు వచ్చినా బీజేపీ చీలిక తెస్తే ఇబ్బంది అవుతోందని ముందే గ్రహించారు. తదనుగుణంగానే అధిష్ఠానాన్ని ఒప్పించి ఆయన్ను ఎమ్మెల్సీగా నియమిస్తూ కేబినెట్ తీర్మానం చేశారు. కానీ గవర్నర్ ఆమోదం లభించకపోవటంతో మైనార్టీల్లో అసంతృప్తిని గ్రహించిన రేవంత్‌రెడ్డి పోలింగ్‌కు కొద్ది రోజుల ముందే అజారుద్దీన్‌కు మంత్రి పదవి కట్టబెట్టారు.
వ్యూహాత్మకంగా నవీన్ ఎంపిక
అటు పార్టీ అభ్యర్థిగా యువకుడు, స్థానికంగా అంగ, అర్ధబలం పుష్కలంగా ఉన్న నవీన్ యాదవ్‌ను ప్రకటించేలా అధిష్ఠానాన్ని ఒప్పించి మెప్పించారు. మైనార్టీ ఓట్ల ప్రాధాన్యత, ఎంఐఎంకున్న పట్టును దృష్టిలో ఉంచుకుని నవీన్ యాదవ్‌ను సీఎం రేవంత్‌రెడ్డి అభ్యర్ధిగా ప్రకటించారు. నవీన్ యాదవ్ రాజకీయ జీవితం ఎంఐఎంలోనే ప్రారంభమైంది. ఇలా అభ్యర్థి ఎంపికలో జాగ్రత్తపడిన ప్రచారంలోనూ తనదైన శైలి ప్రదర్శించారు.
మంత్రులకు బాధ్యతలు
పార్టీ ప్రచార బాధ్యతలను డివిజన్ల వారీగా మంత్రులకు అప్పగించి దగ్గరుండి సమన్వయం చేశారు. క్షేత్రస్థాయిలో నేతలు, కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటు చేసి శ్రేణుల్లో జోష్ నింపారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి సమర్థంగా తీసుకెళ్లేలా సీఎం చర్యలు చేపట్టారు. కార్నర్ మీటింగ్స్ ఏర్పాటు చేసి రెండేళ్ల పాలనతో కాంగ్రెస్ చేసిన అభివృద్ధి పనులు, బీఆర్‌ఎస్ చేస్తున్న వ్యతిరేక ప్రచారాన్ని తిప్పికొట్టారు. ఇలా రేవంత్ ప్రదర్శించిన వ్యూహాత్మక వైఖరితో భారత రాష్ట్ర సమితి, బీజేపీ అభ్యర్థులకు 2023 ఎన్నికల కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. జూబ్లీహిల్స్ చరిత్రలోనే గతంలో ఏ అభ్యర్ధికి ఇంత భారీ మెజార్టీ రాకపోగా అటు బీజేపీకి డిపాజిట్ గల్లంతైంది.
ఇక టార్గెట్ గ్రేటర్ !
జూబ్లీహిల్స్, కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ హైదరాబాద్‌లో పట్టుబిగిస్తోంది. సాధారణ ఎన్నికల్లో గ్రేటర్ పరిధిలో సీట్లు దక్కించుకోకపోవడం తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ నాలుగు ఎంపీల్లో ఒక్కటీ దక్కించుకోలేకపోయింది. ఇప్పుడా లోటును భర్తీ చేస్తూ వచ్చే ఏడాది జరిగే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపునకు రేవంత్ రెడ్డి బాటలు వేశారని విశ్లేషకులు భావిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలతోపాటు, జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు సిద్ధమవుతోంది. జీహెచ్‌ఎంసీ, స్థానికసంస్థల ఎన్నికలు ఎపుడు వచ్చినా విజయం తమదేనన్న ధీమాతో ఉన్నారు. మొత్తానికి జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ గెలుపు రాష్ట్ర రాజకీయ సమీకరణల్లో మార్పులు తెచ్చే అవకాశం ఉందని రాజకీయవర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.



