రిటైర్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలి
: చావా రవి డిమాండ్
కాకతీయ, హనుమకొండ : మార్చి 2024 నుంచి పదవి విరమణ పొందిన ఉద్యోగులు, ఉపాధ్యాయుల రిటైర్మెంట్ బకాయిలను తక్షణమే చెల్లించాలని టీఎస్ యుటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు చావా రవి డిమాండ్ చేశారు. సోమిడి ఉన్నత పాఠశాలలో హిందీ ఉపాధ్యాయుడు కన్నా సోమయ్య పదవి విరమణ సన్మాన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చావా రవి మాట్లాడుతూ.. పదవీ విరమణ తర్వాత బకాయిలు ఆలస్యమవడంతో పలువురు ఉద్యోగులు మానసిక ఆందోళనకు గురవుతున్నారని అన్నారు. ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్ కేటాయించి అయినా బకాయిలు చెల్లించాలని కోరారు. అలాగే పీఆర్సీ నివేదికను వెంటనే అమలు చేయాలని, పెండింగ్లో ఉన్న కరువు భత్యాలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అదే విధంగా హెల్త్ కార్డుల జీఓ విడుదల చేసి అన్ని వర్గాల ఉపాధ్యాయులకు వర్తింపజేయాలని సూచించారు. కార్యక్రమంలో పలువురు యుటీఎఫ్ నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


