పోడు రైతులపై నిర్బంధాలు ఆపాలి..!
పేదల సాగు భూములు స్వాధీనం చేయొద్దు
ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
కాకతీయ, కొత్తగూడెం : పోడు సాగు చేస్తున్న గిరిజనులపై నిర్బంధాలు ఆపాలని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అటవీశాఖ అధికారులను కోరారు. అనాదిగా సాగుచేసుకుంటున్న పేదల భూములను స్వాధీనం చేసుకునే చర్యలకు స్వస్తి చెప్పాలని సూచించారు. లక్ష్మీదేవిపల్లి మండల పరిధిలోని జిల్లా అటవీశాఖ అధికారి కార్యాలయంలో అటవీశాఖ అధికారులు, స్థానిక నాయకులు, పోడు రైతులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గిరిజనుల సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ ఏళ్లుగా పోడు సాగుపై ఆధారపడిన గిరిజనులను ఇబ్బందులకు గురిచేయొద్దన్నారు. సాగులో ఉన్న భూముల్లో కందకాలు తవ్వడం, మొక్కలు నాటడం వల్ల రైతులు నష్టపోతారని తెలిపారు. అయితే కొత్తగా అడవి ఆక్రమణ జరగకుండా అటవీశాఖ తీసుకునే చర్యలకు పూర్తి సహకారం అందిస్తామని చెప్పారు. గిరిజన ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇళ్లు, తాగునీటి పథకాలు, గ్రామీణ రహదారుల వంటి అభివృద్ధి పనులకు అటవీశాఖ సహకరించాలని కోరారు. సమావేశంలో అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.


