‘కాకతీయ’ కథనానికి స్పందన..
శివాలయంలో తవ్వకాలపై అధికారుల దర్యాప్తు
ఎమ్మార్వో నేతృత్వంలో ఘటనాస్థలికి చేరుకున్న బృందం
జేసీబీ తవ్వకాలపై అనుమానాలు.. అన్ని కోణాల్లో విచారణ
అనుమతి లేకుండా పనులు చేస్తే కఠిన చర్యలు హెచ్చరిక

కాకతీయ, నల్లబెల్లి : పురాతన శివాలయంలో అక్రమ తవ్వకాలు జరిగాయన్న వార్తల నేపథ్యంలో అధికార యంత్రాంగం కదిలింది. ‘కాకతీయ’లో ప్రచురితమైన కథనానికి స్పందించిన అధికారులు బుధవారం వెంటనే రంగంలోకి దిగారు. ఎమ్మార్వో ముప్పకృష్ణ సిబ్బందితో కలిసి కన్నారావుపేటకు చేరుకుని సంఘటనపై దర్యాప్తు చేపట్టారు. శివాలయ పరిసరాల్లో గ్రామానికి చెందిన కొందరు జేసీబీలతో తవ్వకాలు నిర్వహించినట్లు సమాచారం అందిందని అధికారులు తెలిపారు. అయితే గ్రామస్థులు ఇవి కేవలం రేకుల షెడ్డు నిర్మాణం కోసమేనని వివరణ ఇచ్చినప్పటికీ, పురాతన అవశేషాలు లేదా ఇతర విలువైన సంపదకు నష్టం జరిగిందా అనే కోణంలోనూ సమగ్రంగా విచారణ కొనసాగిస్తున్నట్లు ఎమ్మార్వో పేర్కొన్నారు.
సమగ్ర నివేదిక.. కఠిన చర్యల హెచ్చరిక
ఈ ఘటనపై పూర్తిస్థాయి నివేదిక సిద్ధం చేసి ఉన్నతాధికారులకు సమర్పిస్తామని ఎమ్మార్వో తెలిపారు. పురాతన దేవాలయాల్లో అనుమతి లేకుండా తవ్వకాలు, నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. శివాలయ పరిసరాల్లో జరిగే ప్రతి చర్యపై గ్రామస్థాయి సిబ్బంది నిత్యం నిఘా ఉంచాలని, ఎలాంటి అనుమానాస్పద చర్యలు జరిగిన వెంటనే నివేదించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.


