రాజీనామా చేసి రండి… ప్రజాక్షేత్రంలో తేల్చుకుందాం
కేంద్రమంత్రి బండి సంజయ్‌కు పొన్నం అనిల్ సవాల్
నగర అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమని వెల్లడి
కాకతీయ, కరీంనగర్ : నగర రాజకీయాల్లో ఆరోపణలు, సవాళ్లు మళ్లీ చర్చనీయాంశంగా మారాయి. కేంద్రమంత్రి బండి సంజయ్ తన ఎంపీ పదవికి రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలో ఎన్నికలకు రావాలని జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్ సవాల్ విసిరారు. గురువారం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, బీజేపీ మాయమాటలతో మేయర్ పీఠాన్ని దక్కించుకుందని విమర్శించారు. పదవులు చేపట్టడం కాకుండా నగర అభివృద్ధి, శాంతిభద్రతలపై దృష్టి పెట్టాలని సూచించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కరీంనగర్ నగరం గణనీయంగా అభివృద్ధి చెందిందని, గంగుల కమలాకర్, బోయినపల్లి వినోద్ కుమార్ నాయకత్వంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు అమలయ్యాయని తెలిపారు. ఈ అంశంపై ఎవరితోనైనా బహిరంగ చర్చకు సిద్ధమని స్పష్టం చేశారు. బండి సంజయ్ రాజీనామా చేస్తే గంగుల కమలాకర్‌ను కూడా రాజీనామా చేయించి ప్రజాక్షేత్రంలో నిలబెడతామని, ప్రజలే అసలు బలం ఏంటో తేల్చాలని అన్నారు. గుగ్గిళ్ల రమేష్ వ్యాఖ్యలను ఖండిస్తూ, వ్యక్తిగత అసహనం వల్లే ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. గంగుల కమలాకర్ సహకారంతో ఎదిగిన వ్యక్తే ఇప్పుడు విమర్శలు చేయడం సరికాదన్నారు. బీజేపీ పాలకవర్గం ఏర్పడి కొద్దిరోజులకే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం బాధాకరమని, ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే రాజకీయాలను సహించబోమని హెచ్చరించారు. గతంలో తమ పార్టీలో ఉన్న నాయకులను బీజేపీలో చేర్చుకుని ఇప్పుడు అభివృద్ధిపై విమర్శలు చేయడం విరుద్ధమన్నారు. కరీంనగర్ అభివృద్ధి కుంటుపడితే బీఆర్ఎస్ పార్టీ తరఫున పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. నాయకులపై వ్యక్తిగత విమర్శలు చేస్తే సహించబోమని హెచ్చరించారు. ఈ సమావేశంలో రెడ్డవేణి మధు, చుక్క శ్రీనివాస్, ఆరే రవి గౌడ్, మీర్ షౌకత్ అలీ, దీకొండ కులదీప్ వర్మ, బొంకూరి మోహన్, గంగాధర చందు, బొనకుర్తి సాయి, వడ్లకొండ పర్షరాం, గుర్రం మహేందర్, సొన్నాయిల దినేష్, అన్వేష్, విక్రమ్ తదితరులు పాల్గొన్నారు.


