మున్సిపాలిటీల వార్డులకు రిజర్వేషన్లు ఖరారు
జగిత్యాల జిల్లాలో ఐదు మున్సిపాలిటీలకు ప్రక్రియ పూర్తి
మహిళా రిజర్వేషన్లకు డ్రా పద్ధతిన ఎంపిక
కాకతీయ, జగిత్యాల : జగిత్యాల జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలకు సంబంధించిన కౌన్సిలర్ పదవుల ఎన్నికల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. రాష్ట్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు, తెలంగాణ మున్సిపాలిటీస్ చట్టం–2019లోని సెక్షన్–7 ప్రకారం ప్రభుత్వం జారీ చేసిన అధికారాల ఆధారంగా ఈ రిజర్వేషన్లను ఖరారు చేస్తూ జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి బి. సత్యప్రసాద్ శనివారం అధికారిక గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. జగిత్యాల మున్సిపాలిటీలో మొత్తం 50 వార్డులు ఉండగా, ఎస్టీకి 1, ఎస్సీకి 4, బీసీలకు 20, జనరల్ మహిళలకు 13, అన్‌రిజర్వ్డ్‌గా 12 వార్డులను ఖరారు చేశారు. మెట్పల్లి మున్సిపాలిటీలోని 26 వార్డుల్లో ఎస్టీకి 1, ఎస్సీకి 3, బీసీలకు 9, జనరల్ మహిళలకు 8, అన్‌రిజర్వ్డ్‌గా 5 వార్డులను కేటాయించారు.
ఇతర మున్సిపాలిటీల్లో ఇదే విధానం
ధర్మపురి మున్సిపాలిటీలో 15 వార్డులు, రాయికల్ మున్సిపాలిటీలో 12 వార్డులు, కోరుట్ల మున్సిపాలిటీలో 33 వార్డులు ఉండగా, ఆయా మున్సిపాలిటీల్లో ఎస్టీ, ఎస్సీ, బీసీ, జనరల్ మహిళలు, అన్‌రిజర్వ్డ్ కేటగిరీలకు అవసరమైన శాతం మేరకు రిజర్వేషన్లు ఖరారు చేశారు. ఎస్సీ, బీసీ, మహిళా రిజర్వేషన్లను వార్డు నంబర్లతో సహా గెజిట్‌లో స్పష్టంగా ప్రకటించారు. జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో కౌన్సిలర్ స్థానాలకు రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియ జరిగింది. ఎస్టీ, ఎస్సీ, బీసీ, జనరల్ కేటగిరీల వారీగా రిజర్వేషన్లు నిర్ణయించిన అనంతరం, మహిళలకు కేటాయించిన వార్డులను డ్రా పద్ధతిలో ఎంపిక చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలకు అనుగుణంగానే రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా నిర్వహించామని తెలిపారు. ఖరారైన రిజర్వేషన్ వివరాలను అధికారికంగా నమోదు చేసి ప్రజలకు అందుబాటులో ఉంచనున్నట్లు వెల్లడించారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేలా రాజకీయ పార్టీల ప్రతినిధులు, అధికారులు, ప్రజలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.


