కాకతీయ. హుస్నాబాద్ : స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ల ఖరారు ఘట్టం ముగిసింది. హుస్నాబాద్ మండలంలో ఎంపీటీసీ, సర్పంచ్ స్థానాలకు రిజర్వేషన్ల వారీగా స్థానాలు ఖరారయ్యాయి. హుస్నాబాద్ మండలంలో 17 గ్రామ పంచాయతీలు ఉండగా ఇందులో ఎంపీటీసీ స్థానాలు 6. పందిళ్ళ ఎస్టి జనరల్, పొట్లపల్లి ఎస్సీ జనరల్, పోతారం (ఎస్) బీసీ జనరల్, గాంధీనగర్ బీసి మహిళ, మీర్జాపూర్ బీసి జనరల్, మహమ్మదాపూర్ ఓసి జనరల్ గా కేటాయించారు.
17 సర్పంచ్ స్థానాలకు జిల్లెల్ల గడ్డ ఎస్టి జనరల్, వంగరామయ్యపల్లి ఎస్టి మహిళ, మీర్జాపూర్, పొట్లపల్లి ఎస్సీ జనరల్, పోతారం (ఎస్) ఎస్సీ మహిళకు ఖరారైంది. బంజరుపల్లి, మాలపల్లి, పందిళ్ళ బీసీ మహిళకు, గాంధీనగర్, కుచనపల్లి, రాములపల్లి ఉమ్మాపూర్ లను బీసీ జనరల్ గా ఖరారు చేశారు. తోటపల్లి మడద, నాగారం, బళ్ళు నాయక్ తండ, మహమ్మదాపూర్ జనరల్ గా నిర్ధారించినట్లు ఎంపీడీవో తెలిపారు. అయితే సర్పంచి, ఎంపీటీసీలకు ఖరారు చేసిన రిజర్వేషన్ల ప్రక్రియ అనేది జనాభా ప్రాతిపదికన చేయలేదని ఇంతవరకు ఎస్సీ స్థానం సర్పంచుకు రానటువంటి గ్రామాలు ఉన్నాయని పలు గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు.
- స్థానిక సంస్థలను అడ్డుకుంటాం..
ఒక వర్గానికి రిజర్వేషన్ల పేరుతో సీట్లను కేటాయిస్తూ అధికారాన్ని కట్టబెట్టడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తుందని తెలంగాణ రాష్ట్ర గిరిజన విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తిరుపతి నాయక్ ఆరోపించారు. 2024 జనాభా లెక్కల ప్రకారం బీసీ వర్గానికి 42 శాతం రిజర్వేషన్ ఇవ్వాలన్న ఉద్దేశంతో మిగతా వర్గాల వారిని పక్కకు పెట్టి రిజర్వేషన్ల పేరుతో సొంత మేనిఫెస్టో కాంగ్రెస్ ప్రభుత్వం తయారు చేసుకుందని మండిపడ్డారు. స్థానిక ఎన్నికలలో నష్టపోతున్న గిరిజనులకు 2024 జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వకుండా 2011 జనాభా లెక్కలను పరిగణలోకి తీసుకోవడం మోసం చేయడమేనన్నారు. గిరిజనులకు సరైన న్యాయం జరగకుంటే స్థానిక సంస్థల ఎన్నికలను అడ్డుకుంటామని హెచ్చరించారు.


