మున్సిపల్ వార్డులకు రిజర్వేషన్ల ఖరారు
కాకతీయ, రామకృష్ణాపూర్ : మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని మున్సిపల్ వార్డుల రిజర్వేషన్లను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఖరారు చేశారు. శనివారం జిల్లా కేంద్రంలోని నస్పూర్ సమీకృత కార్యాలయాల భవన సమావేశ మందిరంలో ఈ ప్రక్రియను నిర్వహించారు. బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్, మంచిర్యాల రాజస్వ మండల అధికారి శ్రీనివాస్‌రావు, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ మహమ్మద్ విలాయత్ అలీతో కలిసి, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో మున్సిపల్ వార్డుల వారీగా రిజర్వేషన్ కేటాయింపు చేపట్టారు. జిల్లాలోని మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 60 డివిజన్లు, బెల్లంపల్లి మున్సిపల్ పరిధిలో 34 వార్డులు, చెన్నూర్ మున్సిపల్ పరిధిలో 18 వార్డులు, క్యాతనపల్లి మున్సిపల్ పరిధిలో 22 వార్డులు, లక్షెట్టిపేట మున్సిపల్ పరిధిలో 15 వార్డులకు రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తైనట్లు కలెక్టర్ తెలిపారు. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, వెనుకబడిన తరగతులు, జనరల్ మహిళ, జనరల్ కేటగిరీలకు నిబంధనల మేరకు రిజర్వేషన్లు కేటాయించినట్లు వెల్లడించారు. ఈ ప్రక్రియతో జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లు మరింత ముందడుగు వేసినట్లయ్యిందని అధికారులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్లు, ఎన్నికల విభాగం అధికారులు, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.


