ఉపాధి హామీ చట్టం రద్దు దుర్మార్గం!
చట్టం స్థానంలో పథకం అంటే పేదల గొంతు నొక్కినట్టే
లక్షలాది మంది ఉపాధి కోల్పోయే ప్రమాదం
వ్యవసాయ కార్మిక సంఘం మహబూబాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు సైదులు
కాకతీయ, నెల్లికుదురు : మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి, దాని స్థానంలో ‘వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవిక మిషన్–2025’ పేరుతో కొత్త బిల్లును తీసుకురావడం దుర్మార్గమైన చర్య అని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం మహబూబాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు ఇసంపేల్లి సైదులు తీవ్రంగా ఖండించారు. నెల్లికుదురు మండల కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్‌లో నిర్వహించిన నిరసన కార్యక్రమం అనంతరం ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న ఈ అనాలోచిత నిర్ణయంతో తెలంగాణలో లక్షలాది మంది పేదలు ఉపాధికి దూరమై వలస బాట పట్టే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఉపాధికి గ్యారెంటీ ఇచ్చే పాత చట్టాన్ని కొనసాగించాలని, కొత్త ఉపాధి పథకాన్ని ప్రజాస్వామ్య శక్తులు ఐక్యంగా వ్యతిరేకించాలని సైదులు పిలుపునిచ్చారు. ఈ బిల్లును వ్యతిరేకిస్తూ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉప్పలయ్య, శ్రీను, వెంకన్న, ఐలేష్, ఐలయ్య, బిక్షపతి, శేఖర్, సంపత్, రవి, సురేష్, హరీష్ తదితరులు పాల్గొన్నారు.


