
- బ్యారేజీ మరమ్మతులకు టెండర్లు
- తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
- ఇరిగేషన్ అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశం
కాకతీయ, తెలంగాణ బ్యూరో : కాళేశ్వరం ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు రిపేర్లు చేయాలని సంకల్పించింది. వాటి పునరుద్ధరణ కోసం ప్రభుత్వం టెండర్లు పిలిచింది. దీనికోసం ఈనెల 15 వరకు గడువు విధించింది. డిజైన్ల తయారీకి అంతర్జాతీయ సంస్థల నుంచి ఈవోఐ కోరుతూ జాతీయస్థాయిలో నోటిఫికేషన్ విడుదల చేసింది. దెబ్బతిన్న బ్యారేజీలను మరమ్మతు చేయాలని జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ తన రిపోర్టులో పేర్కొన్న విషయం తెలిసిందే. ఆ నివేదిక ఆధారంగానే పనులు మొదలుపెట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. వరదల తర్వాత భౌతిక పరీక్షలు నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తోంది. అర్హత సాధించిన సంస్థలను సైతం ఈ పరీక్షల ప్రక్రియలో భాగస్వాములు చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. దీంతో ఎన్డీఎస్ఏ రికమండేషన్స్ ఆధారంగా వీలైనంత త్వరగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు ప్రభుత్వం మరమ్మతు చేసేందుకు సిద్ధమైంది.
రాజకీయ అంశాలకు తావులేదు

నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ ఇచ్చిన మద్యంతర నివేదికలోనే రికమండేషన్స్ ఆధారంగానే ప్రభుత్వం రిపేర్ చేపట్టేందుకు కసరత్తు చేస్తున్నది. మరమ్మతుల కోసం ఎంత ఖర్చు అవుతుందో లెక్క కట్టాలని ఇరిగేషన్ శాఖ అధికారులను ప్రభుత్వం ఆదేశించినట్లు తెలిసింది. ఎన్ డి ఎస్ ఏ రికమండేషన్స్ లో ఏమున్నాయి ? ఎవరెవరు ఏమేమి పనులు చేయాల్సి ఉంటుంది? దేనికి ఎంత ఖర్చు అవుతుంది ? అనే అంశాలపై రెండు, మూడు రోజుల్లో రిపోర్టు రెడీ చేసి ఇవ్వాలని నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. రిపేర్లకు అయ్యే ఖర్చు మొత్తం నిర్మాణ సంస్థతోనే పెట్టించాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. ఎవరి నిర్లక్ష్యంతో తప్పు జరిగినప్పటికీ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ప్రజల కోణంలో ఉంటాయే తప్ప… రాజకీయ అంశాలతో ముడిపడి ఉండవని, అధికారులు కూడా అదే ఆలోచనతో ముందుకు వెళ్లాలని సీఎం స్పష్టం చేసినట్లు సమాచారం.
ఎలా ముందుకెళ్లాలి..

కాళేశ్వరం ప్రారంభించిన తర్వాత వచ్చిన మొదటి వరదకే మేడిగడ్డ ఏడో బ్లాక్‌లో సమస్యలు తలెత్తాయని ఎన్‌డీఎస్ఏ తెలిపింది. 2019లో డ్యామేజీ జరిగిందని నివేదికలో పేర్కొంది. వాటిని అప్పుడే గుర్తించి రిపేర్లు చేపట్టి ఉంటే మిగతా పిల్లర్లకు సమస్యలు వచ్చేవి కాదని స్పష్టం చేసింది. ఆ సమయంలో బ్యారేజీ డిఫెక్ట్ లయబిలిటీ కాలంలో ఉన్నందున పునరుద్ధరణ బాధ్యత నిర్మాణ సంస్థ తీసుకోవాల్సి ఉంటుంది. రిపేర్లకు సంబంధించిన ఖర్చులు అంశాన్ని కూడా ఎన్డీఎస్ ఏ కంటే ముందే రాష్ట్రం ప్రభుత్వం నిర్మాణ సంస్థతో చర్చించింది. అవసరమైన ఖర్చులు భరించాల్సి ఉంటుందని చెప్పగా అందుకు ఒప్పుకున్నట్లు సమాచారం. ఇప్పుడు ఎన్‌డీఎస్ ఏ రికమండేషన్స్ రావడంతో వాడికి తగ్గట్లుగా మరమ్మత్తులు చేపట్టనున్నారు. ఇందుకోసం ఎవరెవరు ఎక్కడ ఏమి పని చేయాలనే దానిపై రెండు మూడు రోజుల్లో క్లారిటీ రానుంది. ఎంత వరకు మరమ్మతులు చేయగలరు? చేసిన తర్వాత కూడా మళ్లీ సమస్యలు వచ్చే అవకాశం ఉంటే ఎలా ముందుకు వెళ్లాలి? అనే అంశాలపై ఇంజినీర్ల బృంధం ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది. ఒక్క బ్యారేజీ తర్వాత మరొక్కటి కాకుండా మూడింటిలో ఉన్న డ్యామేజీలకు ఒకేసారి రిపేర్లు మొదలుపెట్టాలని యోచిస్తున్నట్లు సమాచారం.
వైబ్‌సైట్లో పూర్తి వివరాలు..
కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణకు డిజైన్ కన్సల్టెంట్ ఎంపిక ప్రక్రియను అధికారులు వేగవంతం చేశారు. అదే సమయంలో తుమ్మిడిహెట్టి వద్ద కూడా బ్యారేజీ నిర్మిస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణకు ఈవోఐ పిలవాలని నీటిపారుదలశాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జ గత నెల 19న ఉత్తర్వులు జారీ చేశారు. ఆ తర్వాత కేవలం రెండు వారాల్లోగా డిజైన్ కన్సల్టెంట్ ను ఎంపిక చేయాలని మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి అధికారులను ఆదేశించడంతో ఈ ప్రక్రియ మరింత వేగం పుంజుకుంది. డిజైన్ల కోసం ఆసక్తి పత్రాలు అక్టోబర్ 15 మధ్యాహ్నం మూడు గంటలలోపు సమర్పించాల్సి ఉంది. అదేవిధంగా అక్టోబర్ 15న సాయంత్రం 5 గంటలకు సీల్డ్ కవర్స్ ఓపెన్ చేయనున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలంగాణ నీటిపారుదల వెబ్‌సైట్లో అందుబాటులో ఉంచారు.


