గాంధీ పేరు తొలగిస్తే పోరాటాలే
ఉపాధి హామీ పథకంపై కుట్రలు సహించం
కొమురవెల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహాదేవుని శ్రీనివాస్
కాకతీయ , కొమురవెల్లి : బడుగు–బలహీన వర్గాలకు ఉపాధి కల్పిస్తున్న మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం పేరును తొలగించే ప్రయత్నాలు చేస్తే ఉద్యమాలు తప్పవని కొమురవెల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహాదేవుని శ్రీనివాస్ హెచ్చరించారు. గాంధీ పేరును తొలగించాలన్న ప్రతిపాదనకు నిరసనగా ఏఐసీసీ, పీసీసీ పిలుపు మేరకు గురువారం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గౌరాయపల్లి, అయినాపూర్, రసూలాబాద్, రాంసాగర్ గ్రామాల్లో ఉపాధి హామీ కూలీలను కలిసి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… శాంతియుత ఉద్యమాలతో దేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చిన జాతిపిత మహాత్మా గాంధీ పేరును ప్రపంచం గౌరవిస్తుంటే, కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం గాంధీ ఉనికిని చెరిపేయాలనే కుట్ర చేస్తోందని ఆరోపించారు. అలాగే రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ బడుగు వర్గాల కోసం రూపొందించిన చట్టాలను బలహీనపరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి హామీ పథకం పేరు మారితే కూలీలకు నష్టం జరిగే ప్రమాదముందని, ఈ నిర్ణయాలను వెంటనే వెనక్కి తీసుకోకపోతే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు.


