అక్రమ నిర్మాణాల తొలగింపు
ఆర్‌టీఓ క్రాస్–బెస్తం చెరువు మధ్య క్లీనప్ డ్రైవ్
కాకతీయ, ఖిలావరంగల్ : ఖిలావరంగల్ ఆర్‌టీఓ ఆఫీస్ కూడలి నుండి బెస్తం చెరువు వరకు రోడ్డు ఇరువైపులా నిర్మించబడిన అక్రమ నిర్మాణాలను శనివారం బల్దియా టౌన్ ప్లానింగ్ అధికారులు తొలగించారు. ప్రజల రాకపోకలకు, వాహనాల ట్రాఫిక్‌కు ఆటంకం కలిగించే ఈ షెడ్లు చాలా కాలంగా సమస్యగా మారడంతో అధికారులు ఉదయం నుంచే ప్రత్యేక డ్రైవ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ సిటీ ప్లానర్ ఖలీలోద్దిన్ మాట్లాడుతూ “ఆర్‌టీఓ క్రాస్ రోడ్ నుండి బెస్థం చెరువు వరకూ అక్రమంగా నిర్మించిన షెడ్ల వల్ల అనేక రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయి. దీనిపై వచ్చిన పలు ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకుని జిల్లా కలెక్టర్ మరియు బల్దియా కమిషనర్ ఆదేశాలతో ఈ ప్రత్యేక డ్రైవ్ చేపట్టాం. రోడ్డు పైన అడ్డంకులను పూర్తిగా తొలగించి, ప్రజలకు సురక్షిత మార్గం అందించడమే మా లక్ష్యం” అని తెలిపారు. అధికారుల సమాచారం ప్రకారం, మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఇలాంటి అక్రమ నిర్మాణాలను గుర్తించామని, త్వరలో వాటిపై కూడా చర్యలు తీసుకోనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో టీ పి ఎస్ అవినాష్, టి పి బి ఓలు, టౌన్ ప్లానింగ్ సిబ్బంది మరియు పోలీస్ సిబ్బంది పాల్గొని సహకరించారు. ప్రజలు తమ స్వంత భద్రత కోసం రోడ్లపై అక్రమ నిర్మాణాలు చేయకుండా నగర అభివృద్ధికి సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.


