ఎమ్మెల్యే వ్యాఖ్యలపై రజక సంఘాల ఆగ్రహం
కరీంనగర్‌లో వీర్లపల్లి శంకర్ దిష్టిబొమ్మ దహనం
బాధిత కుటుంబానికి కోటి సాయం
ఉద్యోగం డిమాండ్
కాకతీయ, కరీంనగర్: నాగర్‌కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామంలో రెండు నెలల చిన్నారి మృతి ఘటనపై షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా రజక సంఘాల ఆగ్రహానికి దారి తీశాయి. నిందితులకు మద్దతుగా నిలిచి రజకులపై దుష్ప్రచారం చేశారని ఆరోపిస్తూ ఆదివారం కరీంనగర్ జిల్లా రజక సంఘం ఆధ్వర్యంలో గీతాభవన్ చౌరస్తా (తెలంగాణ చౌక్) వద్ద నిరసన చేపట్టారు. ఎమ్మెల్యే దిష్టిబొమ్మ దహనం చేస్తూ తీవ్రంగా నినాదాలు చేశారు. జిల్లా రజక సంఘం అధ్యక్షుడు రాచకొండ నరేష్ మాట్లాడుతూ చిన్నారి మృతి విషయంలో ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు బాధిత కుటుంబాన్ని అపఖ్యాతిపాలు చేసేలా ఉన్నాయని విమర్శించారు. రాజకీయ ప్రయోజనాల కోసం సంఘాన్ని కించపరిచేలా మాట్లాడారని ఆరోపించారు. వెంటనే వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. తెలంగాణ ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని, మహిళా కమిషన్ సుమోటోగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు. బాధితులకు రూ.1 కోటి ఆర్థిక సాయం, కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కోరారు. ఈ నిరసన కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తకొండ శ్రీనివాస్, డ్రైక్లీనింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు బూత్కూరి శివకృష్ణతో పాటు వివిధ మండలాల నాయకులు పాల్గొన్నారు.


