మత స్వేచ్ఛకు భంగం కలుగుతోంది
సుప్రీంకోర్టు తీర్పుపై పునరాలోచన చేయాలి
ములుగు జిల్లా క్రిస్టియన్ జేఏసీ ప్రతినిధులు
కాకతీయ, ములుగు ప్రతినిధి : మత స్వేచ్ఛ ప్రతి పౌరుడి హక్కు, ఆ హక్కుకు భంగం కలిగించే విధంగా నిర్ణయాలు ఉండకూడదని ములుగు జిల్లా క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ జేఏసీ ప్రతినిధులు తెలిపారు. ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై పునరాలోచన అవసరమని పేర్కొన్నారు. ఇటీవల ములుగు జిల్లాలో జేఏసీ అధ్యక్షుల పక్షాన ప్రతినిధులు ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 నుంచి 25 వరకు ఉన్న ప్రాథమిక హక్కులు ప్రతి పౌరుడికి మత స్వేచ్ఛను హామీ ఇస్తాయని వివరించారు. ఒక మతాన్ని స్వీకరిస్తే ప్రభుత్వ ప్రయోజనాలు కోల్పోవాల్సి వస్తుందన్న అంశం ఆ హక్కులకు విరుద్ధమని చెప్పారు.
ప్రాథమిక హక్కుల పరిరక్షణపై దృష్టి
దేశంలో 140 కోట్ల జనాభాలో ఎస్సీ, ఎస్టీ వర్గాల ప్రజలు గణనీయంగా ఉన్నారని తెలిపారు. అణగారిన వర్గాల అభివృద్ధి కోసం తీసుకునే నిర్ణయాలు వారి స్వేచ్ఛను పరిమితం చేయకూడదని సూచించారు. ప్రజల అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటూనే ఆంక్షలు విధించడం సరైంది కాదని అన్నారు. ఈ అంశంపై సుప్రీంకోర్టు మరోసారి సమీక్ష జరిపి ప్రజాక్షేమానికి అనుకూలంగా తీర్పు ఇవ్వాలని కోరారు.


