గృహజ్యోతి పథకంతో పేదలకు ఊరట
జీరో బిల్లుల లబ్ధిదారులకు ఉప ముఖ్యమంత్రి లేఖలు
విద్యుత్ శాఖ ఏఈ రామకృష్ణ
కాకతీయ, ఖిలా వరంగల్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 6 గ్యారంటీల్లో భాగమైన గృహజ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందుతుండటంతో ప్రజల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఈ సందర్భంగా నూతన సంవత్సరం, సంక్రాంతి శుభాకాంక్షలతో తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గృహజ్యోతి (జిరో బిల్లు) లబ్ధిదారులకు లేఖలు పంపించారు. శనివారం ఖిలా వరంగల్ తూర్పుకోట ప్రాంతంలో విద్యుత్ శాఖ ఏఈ రామకృష్ణ ఆధ్వర్యంలో ఇంటింటికీ వెళ్లి లేఖలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక కార్పొరేటర్ బోగి సువర్ణ సురేష్ హాజరై లబ్ధిదారులకు లేఖలను అందజేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా 52,82,498 పేద కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తూ జిరో బిల్లులు జారీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ పథకానికి ఇప్పటి వరకు ప్రభుత్వం రూ.3,593 కోట్లు విద్యుత్ శాఖకు నేరుగా చెల్లించిందని చెప్పారు. దీని వల్ల పేద కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గి, పిల్లల చదువులు, కుటుంబ అవసరాలకు ఆదా ఉపయోగపడుతోందన్నారు. ఈ కార్యక్రమంలో లైన్మెన్ అచ్చ నాగరాజు, నవీన్ శ్రీనివాస్, రాజేష్, మాటేటి వేణు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


