రబీ పంటలకు ఊరట
మూడుచెక్కలపల్లి లింక్ కెనాల్ ద్వారా చెరువులకు జలధార
దేవాదుల నీరు విడుదల చేసిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి
కాకతీయ, నల్లబెల్లి: దేవాదుల ఎత్తిపోతల పథకం ద్వారా నల్లబెల్లి మండలంలోని చెరువులను నింపేందుకు ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి శుక్రవారం మూడుచెక్కలపల్లి లింక్ మెయిన్ కెనాల్ నుంచి సాగునీటిని విడుదల చేశారు. ఈ నీటితో మండలంలోని రైతులకు రబీ సీజన్‌లో పంటలకు కావాల్సిన నీటి అవసరాలు తీరనున్నాయి. రైతుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని, పంటల అవసరాల కోసం నీటిని విడుదల చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. దేవాదుల పథకం ద్వారా ఈ ప్రాంతానికి సాగునీరు అందడం రైతులకు ఎంతో మేలు చేస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ నీటి విడుదలతో మండలంలోని సుమారు ఐదు వేల ఎకరాల భూములకు సాగునీరు అందుతుందని ఎమ్మెల్యే వెల్లడించారు. రైతుల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడమే తమ తొలి ప్రాధాన్యత అని ఆయన స్పష్టం చేశారు. ప్రతి రైతు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పంటలు సాగు చేసుకునేలా నీటి వనరులను సమర్థంగా వినియోగించుకుంటామని, అవసరమైన చోట మరిన్ని చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్ కుమారస్వామి, ఎస్‌ఈ స్వామి, మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్, ఈఈలు నారాయణ, సుదర్శన్, డీఈ యశ్వంత్, ఏఈలు తదితరులు పాల్గొన్నారు.


