కాకతీయ, నేషనల్ డెస్క్: ప్రజా సమస్యలు తెలుసుకుంటున్న సమయంలో ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్త పై ఓ వ్యక్తి దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఢిల్లీలోని వీధి కుక్కలను తరలిస్తున్నారనే కోపంతోని తాను ఢిల్లీ ముఖ్యమంత్రిపై దాడి చేశానని నిందితుడు పోలీసులకు చెప్పినట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో వీధి కుక్కలను షెల్టర్లకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నామని ఇటీవల ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా మీడియాకు తెలిపిన విషయం తెలిసిందే.
జంతువు ప్రేమికుడైన తనను ఈ విషయం ఎంతగానో భాదించడంతోపాటు ఈ చర్యలను నిలిపివేయాలని అభ్యర్థించడానికి తాను ఢిల్లీ సీఎంను కలిసేందుకు టికెట్ లేకుండా రైల్లో ప్రయాణించి మరీ గుజరాత్ నుంచి ఢిల్లీకి వచ్చినట్లు సకారియా తెలిపాడు. సీఎం తన నివాసంలో కలిసి కుక్కల సమస్య గురించి మాట్లాడడానికి ప్రయత్నించగా అది కుదరకపోవడంతో జన్ సున్వాయ్ కార్యక్రమానికి వెళ్లినట్లు నిందితుడు తెలిపాడు. సమస్యను సీఎం రేఖా గుప్తాకు వివరించగా తన విజ్ఞప్తి ఆమె పట్టించుకోలేదని దాంతో కోపంతో దాడి చేశానని తెలిపాడు.
సకారియా కుక్కల సంరక్షణ సంస్థలతో కలిసి పని చేస్తున్నాడని అతనికి మూగజీవాలు అంటే ఇష్టమని కుటుంబ సభ్యులు చెపుతున్నట్లు జాతీయ మీడియా వర్గాలు పేర్కొన్నాయి. కుక్కలను షెల్టర్ కు తరలించాలని కోర్టు ఆదేశాలు ఇవ్వడంతో అతను తీవ్ర నిరాశ గురైనట్లు చెబుతున్నారు. అయితే నిందితులు వాదనను ఢిల్లీ మంత్రి కపిల్ మిశ్రా కొట్టి పారేశారు.
నిందితుడు ఉద్దేశపూర్వకంగానే ప్లాన్ ప్రకారమే దాడి చేసి ఉండొచ్చన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. రేఖా గుప్తా నివాసం దగ్గర అతను తచ్చాడుతున్న వీడియోలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. అతనిపై ఇప్పటికే పలు కేసులు ఉన్నట్లు తెలిపారు. ఊహించిన విధంగా తనపై జరిగిన దాడితో ఢిల్లీ ముఖ్యమంత్రి షాక్ లో ఉన్నారని.. కపిల్ మిశ్రా తెలిపారు. గాయాలైనప్పటికీ ఆమె ఇంటి నుంచి పని చేస్తున్నట్టు చెప్పారు. తాజాగా జరిగిన దాడి నేపథ్యంలో ఢిల్లీ రేఖా గుప్తాకు ముప్పు పొంచి ఉండటంతో ఆమెకు జడ్ కేటగిరి భద్రతను కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. సీఆర్పీఎఫ్ కు చెందిన 40-45 మంది సిబ్బంది సీఎం కూడా రక్షణ కల్పించే విధుల్లో ఉంటారు.


