రెగ్యులర్ ఎంఈవోలను నియమించాలి
రాష్ట్ర విద్యా పరిరక్షణ కమిటీ సహ-ప్రధాన కార్యదర్శి రఘుశంకర్ రెడ్డి
కాకతీయ, హుజురాబాద్ : ప్రభుత్వ పాఠశాలల్లో పర్యవేక్షణ కోసం టీచర్లతో కమిటీలు ఏర్పాటు చేయడం సరికాదని, రెగ్యులర్ మండల విద్యాధికారులు, ఉపవిద్యాధికారుల ద్వారానే పర్యవేక్షణ జరగాలని డీటిఎఫ్ రాష్ట్ర పూర్వ అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర విద్యా పరిరక్షణ కమిటీ రాష్ట్ర సహ-ప్రధాన కార్యదర్శి యం. రఘుశంకర్ రెడ్డి ప్రభుత్వం ను డిమాండ్ చేశారు.హుజురాబాద్ బాలికల ఉన్నత పాఠశాలలో శనివారం జరిగిన డిటిఎఫ్ కరీంనగర్ జిల్లా కమిటీ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సమావేశానికి డిటిఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఆవాల నరహరి అధ్యక్షత వహించారు.రఘుశంకర్ రెడ్డి మాట్లాడుతూ.విద్యా విభాగంలో సర్వీస్ రూల్స్ ప్రతిష్ఠంభన తొలగించి, పాఠశాలల పర్యవేక్షణకు రెగ్యులర్ అధికారులు నియమించాలి. టీచర్లతో కమిటీలు వేస్తే బోధనకు ఆటంకం కలుగుతుంది అని పేర్కొన్నారు.
రెండు సంవత్సరాలుగా ప్రభుత్వం విద్యారంగ అభివృద్ధి చేస్తున్నామంటూ చెబుతున్నా, వాస్తవంగా నిధుల కేటాయింపు తక్కువగా ఉందని విమర్శించారు. డీటీఎఫ్ రాష్ట్ర ఆడిట్ కమిటీ కన్వీనర్ పల్కల ఈశ్వర్ రెడ్డి మాట్లాడుతూ. ఎస్‌సి.ఇ.ఆర్.టి, విద్యాసంచాలకులు, ఎస్‌ఎస్‌ఏ అధికారుల సమన్వయం లేకుండా పాఠశాలల్లో రకరకాల బోధనేతర కార్యక్రమాలు నిర్వహించడం వలన బోధనకు ఆటంకం కలుగుతోందని తెలిపారు. జిల్లా అధ్యక్షుడు ఆవాల నరహరి పెండింగ్ డిఏలు విడుదల చేసి పిఆర్సీ అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.జిల్లా ప్రధాన కార్యదర్శి చకినాల రాంమోహన్ మాట్లాడుతూ.విద్యాశాఖలో అనేక యాప్‌లు, ఆన్లైన్ డేటా నమోదుతో బోధనకు ఆటంకం కలుగుతోందని, వీటిని తగ్గించాలని సూచించారు.ఈ సమావేశంలో కె. నారాయణ రెడ్డి, ఏ. దామోదర్, తాళ్లపల్లి తిరుపతి, బి. రమేష్, శ్రీరాం చక్రధర్, తూముల తిరుపతి, వేల్పుల రత్నం, యు. శంకర్, తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


