దివ్యాంగుల కొత్త పింఛన్ల నమోదు ప్రారంభం..!
అర్హులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలి
ఏటూరునాగారం సర్పంచ్ కాకులమర్రి శ్రీలత
కాకతీయ, ఏటూరునాగారం : ములుగు జిల్లా ఏటూరునాగారం గ్రామపంచాయతీ పరిధిలో అర్హులైన దివ్యాంగుల కోసం కొత్త పింఛన్ల నమోదు ప్రక్రియ ప్రారంభమైనట్లు సర్పంచ్ కాకులమర్రి శ్రీలత తెలిపారు. గ్రామంలోని ప్రతి అర్హుడికి ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందించేందుకు ఈ ప్రక్రియ చేపట్టినట్లు ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ శ్రీలత మాట్లాడుతూ గ్రామంలోని వార్డు సభ్యులు తమ తమ వార్డుల్లో ఉన్న దివ్యాంగులను గుర్తించి వారికి సమాచారం అందించాలని కోరారు. అర్హులైన వారిని అవసరమైన పత్రాలతో గ్రామపంచాయతీ కార్యాలయానికి తీసుకురావాలని సూచించారు. దరఖాస్తులు పూర్తి చేసిన అనంతరం వాటిని ఎంపీడీఓ కార్యాలయానికి పంపించి తదుపరి చర్యలు చేపడతామని తెలిపారు. దరఖాస్తుకు సదరం సర్టిఫికేట్, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ పాస్బుక్, ఫోటోలు అవసరమని పేర్కొన్నారు. అర్హులైన దివ్యాంగులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సర్పంచ్ కాకులమర్రి శ్రీలత కోరారు.


