శాతవాహన వర్సిటీలో కీలక పదవుల భర్తీ
ఆర్ట్స్ కళాశాలకు కొత్త ప్రిన్సిపల్
మహిళా సెల్, ఆర్‌అండ్‌డీకి డైరెక్టర్లు
యూజీసీ వ్యవహారాలకూ నూతన బాధ్యత
వీసీ ఉత్తర్వులతో అమల్లోకి నియామకాలు
కాకతీయ, కరీంనగర్ : శాతవాహన విశ్వవిద్యాలయంలో కీలక విభాగాలకు నూతన నియామకాలు జరిగాయి. ఉపకులపతి ఆచార్య యు. ఉమేష్‌కుమార్ ఉత్తర్వుల మేరకు ఈ నియామకాలను అమల్లోకి తీసుకొచ్చారు. రిజిస్ట్రార్ జాస్తి రవికుమార్, వీసీకి ఓఎస్డీ డా. డి. హరికాంత్ సమక్షంలో సంబంధిత అధ్యాపకులకు నియామక ఉత్తర్వులు అందజేశారు.శాతవాహన విశ్వవిద్యాలయ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్‌గా డాక్టర్ కె. పద్మావతిని నియమించారు. సమాజశాస్త్ర విభాగంలో సహ ఆచార్యురాలిగా, బోర్డు ఆఫ్ స్టడీస్ చైర్మన్‌గా సేవలందించిన ఆమె 2008లో సహాయ ఆచార్యురాలిగా నియమితులయ్యారు. తెలంగాణ రాష్ట్ర ఉత్తమ అధ్యాపక అవార్డు గ్రహీత అయిన ఆమె ప్రస్తుతం ఎస్సీ–ఎస్టీ సెల్ డైరెక్టర్‌గా కూడా కొనసాగుతున్నారు.

మహిళా సెల్, ఆర్‌అండ్‌డీకి కొత్త డైరెక్టర్లు
మహిళా సెల్ డైరెక్టర్‌గా రసాయన శాస్త్ర సహ ఆచార్యురాలు డాక్టర్ వి. నమ్రతను నియమించారు. 2008లో రసాయన శాస్త్ర విభాగంలో చేరిన ఆమె సైన్స్ కళాశాల ప్రిన్సిపల్‌గా కూడా విధులు నిర్వర్తించారు. మహిళా అధ్యాపకులు, విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆమె తెలిపారు.
రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ సెంటర్ డైరెక్టర్‌గా డాక్టర్ మహమ్మద్ జాఫర్ నియమితులయ్యారు. ఉర్దూ విభాగంలో సహ ఆచార్యులుగా పనిచేస్తున్న ఆయన గతంలో ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్‌గా, ఎన్‌ఎస్‌ఎస్ సమన్వయకర్తగా, యూనివర్సిటీ హాస్టల్స్ చీఫ్ వార్డెన్‌గా బాధ్యతలు నిర్వహించారు. 2020లో తెలంగాణ రాష్ట్ర ఉత్తమ అధ్యాపక అవార్డు అందుకున్నారు. అదేవిధంగా యూజీసీ అఫైర్స్ డైరెక్టర్‌గా ఆచార్య ఎస్. సుజాతను నియమించారు. ప్రస్తుతం సమాజశాస్త్ర విభాగాధిపతిగా కొనసాగుతున్న ఆమె గతంలో ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్‌గా, డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ డైరెక్టర్‌గా సేవలందించారు


