పురపోరుకు సై
నర్సంపేటలో రాజకీయ వేడి
బీఆర్ఎస్–కాంగ్రెస్ మధ్య తగ్గా పర్
కీలకంగా మారనున్న బీజేపీ ప్రభావం.. గెలుపు సీట్లు
గెలుపు గుర్రాల కోసం ప్రధాన పార్టీల అన్వేషణ
ఎమ్మెల్యేకు ప్రతిష్ఠాత్మకం.. మాజీ ఎమ్మెల్యే భవిష్యత్‌కు ఉనికి తప్పనిసరి
నియోజకవర్గ కేంద్రంలో అటు శంకుస్థాపనలు… ఇటు నిరసనలు
సమీకరణాలు మారడంతో కండువా మార్చేస్తున్న పార్టీల నేతలు
కాకతీయ, నర్సంపేట : నర్సంపేట మున్సిపాలిటీలో పురపోరుకు నేడో–రేపో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే సూచనలతో పట్టణ రాజకీయాలు ఒక్కసారిగా హాట్‌సీట్‌గా మారాయి. డివిజన్‌లు, వార్డుల రిజర్వేషన్లే కేంద్రంగా అన్ని పార్టీల్లో వ్యూహాత్మక చర్చలు సాగుతున్నాయి. రిజర్వేషన్లలో అవకాశం కోల్పోయిన కొందరు నేతలు సైలెంట్‌గా ఉండగా, అనుకూలంగా వచ్చిన వారు మాత్రం ఇప్పటికే గల్లీల్లో ఇంటింటి ప్రచారంతో ఓటర్లను చేరువ చేసుకుంటున్నారు. ఇటీవల శివారు గ్రామాల విలీనంతో మున్సిపాలిటీలో వార్డుల సంఖ్య 24 నుంచి 30కి పెరగడంతో అన్ని డివిజన్లలో రాజకీయ సందడి మరింత పెరిగింది. చైర్‌పర్సన్ పీఠం బీసీ మహిళకు రిజర్వ్ కావడం ప్రధాన పార్టీల మధ్య పోటీనీ ఉద్ధృతం చేసింది. టికెట్ తమకే వస్తుందన్న ధీమాతో కొందరు ఆశావహులు ప్రచారం ప్రారంభించగా, పోటీ ఎక్కువగా ఉన్న డివిజన్లలో మాత్రం ఆయా పార్టీల ముఖ్య నాయకుల ఆశీస్సుల కోసం నేతలు లాబీయింగ్‌కు దిగారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ కార్యాలయాల వద్ద సందడి పెరిగింది. అనుకూల నేతలతో మాట్లాడించి టికెట్ దక్కించుకునే ప్రయత్నాలు జోరందుకున్నాయి. ఇన్నాళ్లూ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న కొందరు నేతలు కూడా ఇప్పుడు తెరపైకి వచ్చి పైరవీలు సాగిస్తున్నారు. పోటీ అధికంగా ఉన్న చోట అభ్యర్థుల ఎంపిక పార్టీలకు తలనొప్పిగా మారుతోంది.

ఎవరు గెలుస్తారు?
ప్రధాన పార్టీల నాయకత్వం డివిజన్‌ల వారీగా ‘గెలుపు గుర్రాల’ కోసం వడపోత మొదలుపెట్టింది. ఆయా డివిజన్లలో సామాజిక వర్గాల బలం, అభ్యర్థికి ఉన్న వ్యక్తిగత ఆదరణ, స్థానిక సమీకరణలను గణనలోకి తీసుకుని పేర్లను పరిశీలిస్తున్నారు. ఇప్పటికే సగం వార్డులకు అభ్యర్థులను దాదాపుగా ఖరారు చేసినట్లు సమాచారం. మిగతా డివిజన్లలో ఒక్కో చోట రెండు పేర్లను పరిశీలిస్తూ ద్వితీయ శ్రేణి నేతలతో సంప్రదింపులు చేస్తున్నారు. ప్రత్యర్థి పార్టీ గెలుపును అడ్డుకునేందుకు డమ్మీ అభ్యర్థుల వ్యూహాలపై కూడా చర్చ సాగుతోంది. ఎన్నికల సమీకరణలు మారుతుండటంతో పార్టీల మధ్య చేరికల జోరు పెరిగింది. గత వారం రోజులుగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీల్లో నేతలు కండువాలు మార్చుకుంటున్నారు. అధికార పార్టీలో నుంచి బీఆర్ఎస్‌లోకి, బీఆర్ఎస్ నుంచి అధికార పార్టీలోకి మారుతున్న నేతలతో రాజకీయ వాతావరణం రోజురోజుకు మారుతోంది.
అటు శంకుస్థాపనలు… ఇటు నిరసనలు
ఎన్నికల వేళ పట్టణంలో రాజకీయ కార్యకలాపాలు మరింత ఉధృతమయ్యాయి. అధికార పార్టీ ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి విలీన గ్రామాలు, పట్టణ వార్డుల్లో సీసీ రోడ్లు, కులసంఘ భవనాలకు శంకుస్థాపనలు చేస్తుండగా, ప్రతిపక్ష నేతలు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి నేతృత్వంలో గతంలో తీసుకొచ్చిన జీవోలను రద్దు చేసి అభివృద్ధికి అడ్డుపడుతున్నారని ఆరోపిస్తూ నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. మొత్తంగా నర్సంపేట మున్సిపాలిటీ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతూ ఉత్కంఠను పెంచుతున్నాయి.


