పుర పోరుకు సై
మున్సిపల్ ఎన్నికలకు ప్రధాన పార్టీలు రెడీ
జిల్లాలో మొత్తం 12 మున్సిపాలిటీలు.. 254 వార్డులు
పదవులపై కన్నేసిన ఆశావహులు
అధికార పార్టీలో పంచాయతీ ఎన్నికల జోష్
బీఆర్ఎస్‌కూ ఊరటనిచ్చిన ఫలితాలు
ఇదే ఊపు కొనసాగించాలని భావిస్తున్న రెండు పార్టీలు
ఎమ్మెల్యేల దృష్టిలో పడేందుకు అభ్యర్థుల ప్రయత్నాలు
ముఖ్య నేతలు, గాఢ్‌ఫాదర్ల చుట్టూ ప్రదక్షిణాలు
పట్టణ ప్రాంతాల్లో వేడెక్కిన రాజకీయం
జనవరిలో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్.. ఫిబ్రవరిలో పోలింగ్?
కాకతీయ, తెలంగాణ బ్యూరో: పల్లెల్లో పంచాయతీ ఎన్నికల సందడి ముగియడంతో ఇప్పుడు ప్రజలు, పార్టీల దృష్టి మున్సిపల్, పరిషత్ ఎన్నికలపై పడింది. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో అవకాశం కోల్పోయిన వారు, ఛాన్స్ వచ్చినా ఓడిపోయిన వారు… రానున్న పరిషత్, మున్సిపల్ ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు. పంచాయతీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అధికార కాంగ్రెస్‌తోపాటు ప్రతిపక్ష బీఆర్ఎస్ కేడర్‌లోనూ జోష్ పెంచాయి. దీంతో ఉమ్మడి జిల్లాలోని 12 మున్సిపాలిటీలతోపాటు 74 జడ్పీటీసీ, ఎంపీపీ పదవుల్లో మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుని మరోమారు పట్టు సాధించేందుకు అధికార పక్షంతోపాటు మిగిలిన పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ముఖ్యంగా వచ్చే నెలలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతాయనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆశావహులంతా తమ ప్రయత్నాలు ముమ్మరం చేసుకుంటున్నారు. దీంతో పట్టణ ప్రాంతాల్లో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది.
వచ్చే నెలలోనే నగరా!
ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొత్తం 1684 పంచాయతీల్లో 1008 స్థానాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు విజయం సాధించారు. వీరే కాకుండా మరో 120 మందికి పైగా రెబల్స్ కూడా అధికార పార్టీకి చెందిన వారే గెలిచారు. వీరంతా త్వరలోనే అధికార కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు వరుస ఓటములతో కుంగిపోతున్న గులాబీ శ్రేణులకు సైతం పంచాయతీ ఎన్నికలు కొంత ఊరట ఇచ్చాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 494 సర్పంచ్ స్థానాల్లో తన మద్దతుదారులను బీఆర్ఎస్ గెలిపించుకుంది. దీంతో గులాబీ శ్రేణుల్లోనూ కొత్త ఉత్సాహం నెలకొంది. ఇక బీజేపీతోపాటు సీపీఐ, సీపీఎంలు కూడా తమ ఉనికిని చాటుకునేలా సీట్లు సాధించాయి. ఇదే ఊపుతో రానున్న మున్సిపల్, పరిషత్ ఎన్నికల్లోనూ సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్నారు. గత జనవరిలోనే మున్సిపాలిటీల పాలకమండలి పదవీకాలం ముగిసింది. దీంతో సుమారు ఏడాది కాలంగా మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించకుండా ప్రత్యేక అధికారులను నియమించారు. అయితే పంచాయతీ ఎన్నికల ఫలితాలను దృష్టిలో పెట్టుకొని రేవంత్ ప్రభుత్వం వచ్చే నెలలోనే మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు కసరత్తు చేస్తుందనే ప్రచారం జరుగుతోంది. దీంతో పట్టణ ఆశావాహుల్లో పదవులపై ఆశలు రేకెత్తుతున్నాయి.
12 మున్సిపాలిటీలు.. 254 వార్డులు
ఉమ్మడి వరంగల్ జిల్లాలో జనగామ, మహబూబాబాద్, పరకాల, నర్సంపేట, వర్ధన్నపేట, భూపాలపల్లి, తొర్రూరు, మరిపెడ, డోర్నకల్ మున్సిపాలిటీలు ఉన్నాయి. ఈ తొమ్మిది మున్సిపాలిటీల్లో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులతోపాటు మొత్తంగా 200 వార్డు కౌన్సిల్ పోస్టులు ఉన్నాయి. అత్యధికంగా మహబూబాబాద్ మున్సిపాలిటీలో 36 వార్డులు ఉండగా.. జనగామ, భూపాలపల్లి మున్సిపాలిటీలో 30 చొప్పున వార్డులు ఉన్నాయి. ఇక ఇటీవల ప్రభుత్వం జిల్లా కేంద్రమైన ములుగును మున్సిపాలిటీగా మార్చింది. అలాగే స్టేషన్ ఘన్‌పూర్, కేసముద్రం కూడా మున్సిపాలిటీగా మారాయి. దీంతో ఈ మూడు కొత్త మున్సిపాలిటీల్లో 54 వార్డులను ఏర్పాటు చేశారు. దీంతో మొత్తం ఉమ్మడి జిల్లాలో 12 మున్సిపాలిటీల్లో 254 వార్డులు ఏర్పాటు అయ్యాయి. గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ కు ఏప్రిల్ వరకు గడవు ఉండటంతో ప్రస్తుతం అన్ని పార్టీలు కూడా 12 మున్సిపాలిటీల్లో పట్టు సాధించేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నాయి. ఆశావాహులు కూడా ఇప్పటి నుంచే పదవుల కోసం ఎమ్మెల్యేల దృష్టిలో పడేలా కార్యాచరణ సిద్ధం చేస్తుండడంతో పట్టణాల్లో రాజకీయాలు హీట్ ఎక్కుతున్నాయి.
ఓటర్ల జాబితాపై ఈసీ ఫోకస్
ఎన్నికల నిర్వహణలో అత్యంత కీలకమైన ఓటర్ల జాబితా రూపకల్పనపై ఎన్నికల కమిషన్ దృష్టి సారించింది. జనవరి రెండో వారం నాటికి తుది ఓటర్ల జాబితాను సిద్ధం చేసేలా కార్యాచరణ రూపొందించారు. కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో వార్డుల విభజన, రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియ కూడా వేగవంతం కానుంది. క్షేత్రస్థాయిలో పార్టీ బలాన్ని నిరూపించుకోవడంతో పాటు, రాబోయే సాధారణ ఎన్నికలకు ముందే పట్టణ ఓటర్ల మొగ్గు ఎటువైపు ఉందో తెలుసుకోవడానికి ఈ ఎన్నికలను అధికార పార్టీ ఒక ‘సెమీఫైనల్’గా భావిస్తోంది.


