పంచాంగ శ్రవణం.. ప్రత్యేక పూజలు
ఘనంగా ఉగాది వేడుకలు
కాకతీయ, చేర్యాల : పరాభవ నామ సంవత్సరంలో ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని చేర్యాల అయ్యప్ప స్వామి ఆలయ కమిటీ అధ్యక్షులు తాటిపెల్లి ఆంజనేయులు గుప్త ఆకాక్షించారు. ఉగాది పర్వదినం సందర్బంగా పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలను చేర్యాల, కొమురవెల్లి, మద్దూర్, దూల్మిట్ట మండలలా వ్యాప్తంగా గురువారం ఘనంగా నిర్వహించారు. ఆలయాల్లో పంచాంగ పఠనాలు, ఉగాది పచ్చడి స్వీకరణలు, కవిసమ్మేళనాలు నిర్వహించారు. భక్తులు ఆలయాలను దర్శించి ఇంటిల్లిపాది చల్లగా ఉండాలని కోరుకున్నారు. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులతో కలసి భోజనాలు, ఉగాది పచ్చడి స్వీకరణలు, కబుర్లు కాలక్షేపాలతో గడిపారు. ఆలయాల్లో, కూడళ్ళలో, సామాజిక, ప్రచార, ప్రసార మాద్యమాల ద్వారా పంచాంగ శ్రవణం చేసి తమ భవిష్యత్ గురించి తెలుసుకున్నారు. అర్చకులు, పురోహితులను ఇళ్ళకు ఆహ్వానించుకొని పంచాంగం చెప్పించుకున్నారు. వేడుకల్లో,చేర్యాల అయ్యప్ప స్వామి, వేణుగోపాల స్వామి ఆలయాల్లో జనం సందడి కనిపించింది. అయ్యప్ప స్వామి ఆలయంలో ఆలయ కమిటీ అధ్యక్షులు తాటిపెల్లి ఆంజనేయులు గుప్త ఆధ్వర్యంలో ఉగాది పంచాంగ పఠనం వేదపండితులు దేశపతి చైతన్య శర్మ వినిపించారు. ఈ సంకల్పంలో దేశంలో శాంతి సౌభాగ్యాలతో విల్లసిల్లాలని, ప్రకృతి వైపరీత్యాలు సంభవించకుండా సకాలంలో తగినంత వర్షాలు కురిసి పాడిపంటలతో తులతూగాలని, జనులందరికీ ఆయురారోగ్యాలు కలగాలని, అగ్ని ప్రమాదాలు, వాహన ప్రమాదాలు జరగకుండా ఉండాలని, ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలంటూ ఆలయ అర్చకులు, వేదపండితులు సంకల్ప పఠనం చేశారు.


