కాకతీయ, వరంగల్ బ్యూరో : దసరా సందర్భంగా వరంగల్, పరకాలలో సంప్రదాయంగా నిర్వహించే రావణాసుర దహన కార్యక్రమాలు ఈసారి వైభవంగా జరిగాయి. పరకాల పట్టణంలోని అంగడి మైదానంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రాం రెడ్డి, ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు. అలాగే వరంగల్ రంగలీల మైదానంలో 100 ఏళ్లకు పైగా కొనసాగుతున్న రావణ వధ సంప్రదాయంలో భాగంగా భారీ దిష్టిబొమ్మను బాంబులతో పేల్చి బూడిద చేశారు. ఈ సందర్భంగా ఇనగాల వెంకట్రాం రెడ్డి మాట్లాడుతూ.. 1920లలో రావణుడి పోస్టర్ దహనం చేయడం మొదలై, స్వాతంత్ర్యం తర్వాత బట్టలతో చేసిన దిష్టిబొమ్మలు దహనం చేసేవారు. క్రమంగా 10 తలల రావణుడి ప్రతిమను తయారు చేసి దహనం చేసే సంప్రదాయం ఏర్పడిందని గుర్తుచేశారు. రావణ దహనంతో పాటు క్రాకర్ షో, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను అలరించాయి.


